కాంగ్రెస్ పార్టీకి హార్దిక్ పటేల్ బుధవారం రాజీనామా చేశారు. దీంతో కాంగ్రెస్ పై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దిన్ ఓవైసీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ లోని వ్యక్తులకు కూడా ఆ పార్టీపై విశ్వాసం లేదని ఓవైసీ అన్నారు.
‘ కాంగ్రెస్ కార్యకర్తలు ఆ పార్టీని విడిచి వెళ్లిపోతున్నారు. గుజరాత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హార్దిక్ పటేల్ కు అనధికారిక అధ్యక్షుడిపై నమ్మకం లేదు. అందుకే అతను వెళ్లిపోయాడు’ అని ఓవైసీ విమర్శించారు.
మహారాష్ట్రను కాంగ్రెస్ 15 సంవత్సరాల పాటు పాలించిందన్నారు. కానీ ఇప్పుడు ఆ పార్టీ మూడవ స్థానానికి పడిపోయిందని చెప్పారు. మహారాష్ట్రలో శివసేన-ఎన్‌సీపీ-కాంగ్రెస్ కూటమిలో ఆ పార్టీకి అతి తక్కువ సీట్లను ఉన్నాయని తెలిపారు.
గతంలో ఢిల్లీలో షీలా దీక్షిత్ ప్రభుత్వం ఉండేదన్నారు. కానీ ఇప్పుడు ఢిల్లీలో కాంగ్రెస్ ఎక్కడా కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. కేరళలో గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ పార్టీ ఓడిపోయిందన్నారు.