కాలేజీలో హిజాబ్ వివాదం కన్నడనాట రాజకీయ వేడిని రాజేస్తోంది. ఇదే అంశంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. హిజాబ్ వివాదంలో తలదూర్చాలని ప్రయత్నించిన పాకిస్థాన్ కు ఒవైసీ గట్టి వార్నింగ్ ఇచ్చారు. హిజాబ్ ధరించిన వారిని విద్యా సంస్థల్లోకి అనుమతించకుండా ముస్లిం బాలికల హక్కులను భారత్ కాలరాస్తోందంటూ పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహమ్మద్ ఖురేషీ చేసిన వ్యాఖ్యలపై ఒవైసీ మండిపడ్డారు.
యూపీలోని ఎన్నికల ప్రచారం సందర్భంగా ఒవైసీ దీనిపై మాట్లాడుతూ.. మీ పని మీరు చూస్కోండంటూ హెచ్చరించారు. బాలికల విద్యపై భారత్ కు పాకిస్థాన్ పాఠాలు అవసరం లేదని అన్నారు. మలాలాపై అక్కడ కాల్పులు జరిగాయి. తమ బాలికలకు అక్కడ భద్రత కల్పించడంలో విఫలమైన వారు, ఇప్పుడు భారత్ కు పాఠాలు చెబుతున్నారా అంటూ ఓవైసీ మండిపడ్డారు.
మహిళలకు హిజాబ్ భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని.. ఆ హక్కు పరిరక్షణ కోసమే పోరాటం జరుగుతుందన్నారు. హిజాబ్ కోసం పోరాడే వాళ్లకు మా సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. దీనితో పాటు మీరు ఎవరినీ బలవంతం చేయకూడదని ముత్తుస్వామి తీర్పులో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందన్నారు.
Advertisements
ఏం తినాలి.. ఏ బట్టలు వేసుకోవాలో వారి ఇష్ట ప్రకారం జరుగుతుందన్నారు. కర్నాటక బీజేపీ తప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి హిజాబ్ వివాదాన్ని తెరపైకి తెచ్చిందని విమర్శించారు. ఇందులో ఆర్టికల్ 14, 15, 19, 21ని నిషేధిస్తున్నట్లు స్పష్టమవుతుందని పేర్కొన్నారు. ఇది మా ఇంటి సమస్య.. మేం పరిష్కరించుకుంటామని సంచలన వ్యాఖ్యలు చేశారు. మా చట్టాల గురించి.. మా గురించి మాట్లాడటానికి పాకిస్తాన్ ఎవరు..? అంటూ ప్రశ్నించారు.