అమెరికాలోని సియాటెల్ నగరం రికార్డు సృష్టించింది. కుల వివక్షను నిషేధిస్తూ దేశంలోనే తొలి నగరంగా నిలిచింది. ఈ మేరకు సియాటెల్ నగర కౌన్సిల్ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. దీంతో సియాటెల్ కులవివక్షను నిషేధించిన తొలి అమెరికా నగరంగా నిలిచిందని అసోసియేటెడ్ ప్రెస్ వార్తా సంస్థ వెల్లడించింది.
కుల వివక్షను చట్ట విరుద్ధం చేయాలని అమెరికాలోని దక్షిణాసియా ప్రజల డిమాండ్ తీవ్ర రూపం దాల్చడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇలాంటి చట్టాలు చేయడమంటే ఆయా నిర్దిష్ట సమాజాలను కించపర్చడమేనని కొందరు హిందూ అమెరికన్లు వాదిస్తున్నారు.
కుల వివక్షను నిషేధించాలన్న ప్రతిపాదనపై సియాటెల్ నగర్ కౌన్సిల్ లో మంగళవారం ఓటింగ్ జరగగా.. 6-1 ఓట్ల తేడాతో ఆమోదం పొందింది. కాగా ఇండియన్ అమెరికన్ క్షమా సావంత్ ఈ ప్రతిపాదనను కౌన్సిల్ లో తీసుకొచ్చారు. అయితే ఈ అంశంపై మాట్లాడేందుకు 100 మందికి పైగా గత వారం ప్రారంభంలోనే నమోదు చేసుకున్నారు.
ఇక భారతీయులు అత్యంత ఎక్కువగా ఉండే దేశాల్లో అమెరికా కూడా ఒకటి. అమెరికాలో 1980 నాటికి, 2,06,000 మంది భారతీయులుండగా 2021 నాటికి ఆ సంఖ్య 27 లక్షలకు పెరిగిందని మైగ్రేషన్ పాలసీ ఇనిస్టిట్యూట్ గణాంకాలు చెప్తున్నాయి. అయితే గత మూడేళ్ళ కాలంలో అమెరికాలోని అనేక కాలేజీలు, యూనివర్సిటీలు కుల వివక్షను నిషేధించడానికి ముందుకొచ్చాయి.