ప్రముఖ హక్కుల సంస్థ ఆక్స్‌ఫామ్ ఇంటర్నేషనల్ సంస్థ తన నివేదికలో ఆసక్తికర విషయాలు వెల్లడించింది. సర్వైవల్ ఆఫ్ ద రిచెస్ట్ పేరిట సంస్థ ఈ నివేదికను విడుదల చేసింది. భారత్‌లోని మొత్తం సంపదలో 40 శాతం కేవలం ఒకశాతం ధనవంతుల దగ్గరే ఉందని వెల్లడించింది. నివేదిక ప్రకారం….
దేశ సంపదలో కేవలం 3శాతం మాత్రమే అట్టడుగు వర్గాల వద్ద ఉంది. ఈ జాబితాలో టాప్ 100 మంది భారతీయ బిలియనీర్లపై 2.5 శాతం లేదా మొదటి 10 మంది బిలియనీర్లపై 5 శాతం పన్ను విధిస్తే చదువు మానేసిన పిల్లలను తిరిగి పాఠశాలలకు తీసుకు వచ్చేందుకు అవసరమైన డబ్బు అందుతుంది.
దేశంలో బిలియనీర్లపై ఒకసారి రెండు శాతం పన్ను విధిస్తే రూ.40,423 కోట్ల ఆదాయం వస్తుంది. ఈ మొత్తాన్ని ఉపయోగించి దేశంలో పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న పిల్లలందరికీ రాబోయే మూడేండ్ల పాటు పోషకాహారం అందించవచ్చు.
2017-2021 మధ్య బిలియనీర్ గౌతమ్ అదానీ సంపద భారీగా పెరిగింది. దానిపై ఒక సారి విధించే న్నుతో రూ. 1.79 లక్షల కోట్ల నిధులను సమీకరించవచ్చు. ఈ డబ్బుతో దేశంలో ప్రాథమిక పాఠశాలల్లో పనిచేసేందుకు 50 లక్షల మంది ఉపాధ్యాయులను నియమించ వచ్చు. వారికి ఏడాదిపాటు జీతాలు ఇవ్వడానికి సరిపోతుంది.
దేశంలోని టాప్ 10 సంపన్నులపై ఒకేసారి 5 శాతం పన్ను విధిస్తే రూ. 1.37 లక్షల కోట్ల డబ్బు వస్తుంది. 2022-23 గానూ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (రూ. 86,200 కోట్లు), ఆయుష్ మంత్రిత్వ శాఖ (రూ. 3,050 కోట్లు) అంచనా వేసిన నిధుల కంటే 1.5 రెట్లు ఎక్కువ.
ఇక ఒక పురుష కార్మికుడితో పోలిస్తే ప్రతి మహిళా కార్మికురాలు రూపాయికి కేవలం 63 పైసలు మాత్రమే పొందుతున్నారు. షెడ్యూల్డ్ కులాలు, గ్రామీణ ప్రాంత కార్మికుల సంపాదనల్లో వ్యత్యాసం అధికంగా ఉంది. అగ్ర సామాజిక వర్గాలు సంపాదిస్తున్న దానితో పోల్చినప్పుడు షెడ్యూల్డ్ కులాలు 55 శాతం మాత్రమే పొందుతున్నాయి. ఇక గ్రామీణ ప్రాంతాల కార్మికులను పట్టణాల్లో కార్మికులతో పోలిస్తే 2018- 2019 మధ్య సగం మాత్రమే సంపాదించారు.
2021-22లో జీఎస్టీ ద్వారా వచ్చిన మొత్తం రూ.14.83 లక్షల కోట్లలో సుమారు 64 శాతం సంపదలో అట్టడుగున ఉన్న 50 శాతం జనాభా నుంచి వచ్చింది. జీఎస్‌టీ మొత్తం ఆదాయంలో కేవలం 3 శాతం మాత్రమే తొలి పది మంది బిలియనీర్ల నుంచి వస్తోంది.
భారత్‌లో మొత్తం బిలియనీర్ల సంఖ్య 2020లో 102గా ఉంది. అది 2022 నాటికి 166కు పెరిగింది. దేశంలోని 100 మంది ధనవంతుల మొత్తం సంపద 660 బిలియన్ల డాలర్ల (రూ. 54.12 లక్షల కోట్లు)కు చేరుకుంది. ఈ మొత్తంతో కేంద్ర బడ్జెట్‌కు 18 నెలలకు పైగా నిధులను అందించవచ్చు.
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అసమానతలపై ఆక్స్‌ఫామ్ సర్వే వెల్లడించింది. ఇందులో ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ప్రపంచంలోని ధనవంతుల్లో తొలి ఒక శాతం మంది గత రెండేళ్లలో సంపాదించిన సంపద ప్రపంచ జనాభాలోని మిగిలిన వారి సంపదతో పోలిస్తే దాదాపు రెట్టింపు వుంటుందని నివేదిక తెలిపింది.