డిసెంబర్ నుండే భారత్ లోనూ కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నారా….? అంటే అవుననే అంటున్నారు వ్యాక్సిన్ ఉత్పత్తి దిగ్గజ కంపెనీ సీఈవో. ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ తయారు చేస్తున్న ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ ను భారత్ కు చెందిన సీరమ్ సంస్థ తయారు చేస్తుంది. ఇప్పటికే మూడో దశ ప్రయోగాల్లోనూ మంచి ఫలితాలు కనపర్చుతున్నందున… సీరమ్ సంస్థ ఇప్పటికే వ్యాక్సిన్ ఉత్పత్తిని ప్రారంభించింది.
డిసెంబర్ నాటికి 100 మిలియన్ డోసుల ఉత్పత్తి లక్ష్యంగా పనిచేస్తున్నామని… దేశంలో ఉన్నకరోనా అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం డిసెంబర్ లో వ్యాక్సిన్ పంపిణీకి అనుమతిచ్చే అవకాశం ఉందని సీరమ్ సీఈవో అదర్ పూనావాలా వెల్లడించారు. వచ్చే ఏడాది తుది అనుమతులు వచ్చాక జరిగే ఉత్పత్తిలో దక్షిణాసియా దేశాలకు 50శాతం, డబ్లుహెచ్వో ఏర్పాటు చేసిన కోవాక్స్ కూటిమికి 50శాతం డోసులను పంపిస్తామన్నారు.
సీరమ్ సంస్థ 5 వ్యాక్సిన్ కనిపెడుతున్న సంస్థలతో ఒప్పందం చేసుకుంది. ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ ను గత రెండు నెలలుగా 40మిలియన్ల డోసులు ఉత్పత్తి చేశారు. దీంతో డిసెంబర్ నాటికి ఉత్పత్తి మరింత పెరుగుతుందని… యూకే ప్రభుత్వ అనుమతితో భారత ప్రభుత్వానికి క్లినికల్ రిసెర్చ్ డేటాను సమర్పిస్తే… భారత్ ప్రభుత్వం కూడా అత్యవసర వ్యాక్సినేషన్ కు అనుమతిచ్చే అవకాశం ఉంటుందని ఫార్మా కంపెనీలు అభిప్రాయపడుతున్నాయి.