మహీంద్ర కంపెనీ ఆధ్వర్యంలో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ ను జహీరాబాద్ ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటు చేయడం అభినందనీయమని మంత్రి హరీష్ రావు కొనియాడారు. రాష్ట్రంలో ఇది 86వ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ అని ఆయన వెల్లడించారు.
కరోనా సెకండ్ వేవ్ లో 500 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం పడిందని చెప్పారు. కానీ.. 200 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ మాత్రమే అందుబాటులో ఉందని తెలిపారు. మిగతా 300 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ తమిళనాడు, గోవా రాష్ట్రాల నుండి తెప్పించుకోవడానికి నానా కష్టాలు పడ్డామన్నారు. ఈ పరిస్థితి గమనించి కేసీఆర్ 500 మెట్రిక్ టన్నులకు ఆక్సిజన్ ఉత్పత్తి పెంచాలని ఆదేశించారని గుర్తు చేశారు.
ప్రస్తుతం 300 మెట్రిక్ టన్నుల ఉత్పత్తికి చేరుకున్నామని స్పష్టం చేశారు హరీష్. మరో 200 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తికి పాశమైలారంలో ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు అగ్రిమెంట్ చేసుకున్నామని వివరించారు. త్వరలో ఇది ప్రారంభం అవుతోందన్నారు. రాష్ట్రంలో 27 వేల పడకలు ఉంటే ప్రతీ పడకకు ఆక్సిజన్ సౌకర్యం కల్పించామని చెప్పారు.
ఎలాంటి పరిస్థితి వచ్చినా ఆక్సిజన్ కొరత ఉండకుండా జాగ్రత్తలు చేపట్టామని అన్నారు మంత్రి. వైద్య రంగంలో గుణాత్మక మార్పులు తెచ్చామని… కేసీఆర్ ఆదేశాల మేరకు చేపట్టిన జ్వర సర్వే మంచి ఫలితాలను ఇస్తోందని తెలిపారు.
రెండు, మూడు రోజులుగా రాష్ట్రంలో కరోనా పాజిటివ్ రేటు తగ్గుముఖం పట్టిందని చెప్పారు హరీష్. అయినా.. నిర్లక్ష్యం తగదని సూచించారు. దేశంలో పేదలకు ఉత్తమ వైద్య సేవలు అందించే విషయంలో తెలంగాణ మూడో స్థానంలో ఉందన్న ఆయన.. తొలి స్థానంలో నిలచేలా కృషి చేస్తామని చెప్పారు.