భారత క్రికెట్ అభిమానులకు నిరాశపర్చే వార్త ఇది. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేస్తూ కమిన్స్ వేసిన షార్ట్ పిచ్ బంతి మణికట్టుకు బలంగా తాకటంతో విలవిలలాడుతూ మైదానాన్ని వీడిన పేసర్ మహ్మద్ షమీ పూర్తిగా సిరీస్ కు దూరం కానున్నాడు. స్కానింగ్ లో మణికట్టుకు పగుళ్లు ఉన్నట్లు తేలటంతో తను కోలుకోవటానికి సమయం పట్టే అవకాశం ఉండటంతో స్వదేశానికి బయలుదేరనున్నాడు.
పితృత్వ సెలవులపై ఇండియాకు తిరిగి రానున్న కోహ్లితో పాటే పేసర్ షమీ కూడా ఇండియా వచ్చేయనున్నాడు. తన పేస్, స్వింగ్ తో ప్రత్యర్థి బ్యాట్స్ మెన్ ను ఇబ్బందిపెట్టే షమీ సిరీస్ కు దూరం కావటం ఇండియాకు ఇబ్బందికర పరిణామమేనని, అనుభవజ్ఞుడైన షమీ లాంటి పేసర్ సిరీస్ కు దూరం అవుతున్నాడని సీనియర్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. షమీ స్థానంలో పరిమిత ఓవర్ల క్రికెట్ లో ఆకట్టుకున్న నటరాజన్ కు ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. అయితే, దీనిపై బీసీసీఐ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
మరోవైపు తొడ కండరాల గాయంతో తొలిటెస్టుకు దూరం అయిన స్పిన్నర్ రవీంద్ర జడేజా రెండో టెస్టుకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా మెల్‌బోర్న్ వేదికగా డిసెంబర్ 26న భారత్ రెండో టెస్టు ఆడనుంది.