వడ్ల కొనుగోలుపై తెలంగాణలో మరో కొత్త దుమారం మొదలైంది. సరిగ్గా ఉప ఎన్నిక సమయంలోనే, సీఎం కేసీఆర్‌కు ఎఫ్‌సీఐ పెట్టిన నిబంధనలు గుర్తుకు వస్తాయో.. లేక కేంద్రమే ఉప ఎన్నిక సమయాన్ని చూసి కేసీఆర్‌కు రూల్స్‌ను గుర్తు చేస్తుందో తెలియదు కానీ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి మళ్లీ రైతులని నిండా ముంచేందుకు సిద్ధమవుతున్నాయి.
రైతులు సన్న వడ్లే వేయాలని చెప్పి, గతేడాది అన్నదాతల నోట్లో సున్నం కొట్టారు కేసీఆర్. కేంద్రం ఇవ్వకపోయినా.. తామే వందో, రెండు వందలో అధికంగా ధర కల్పిస్తానని చెప్పి. దుబ్బాక ఉప ఎన్నికవేళ మభ్యపెట్టారు. కానీ ఎలక్షన్లు కాగానే చేతులెత్తేశారు. దీంతో విధిలేక అయినకాడికి అమ్ముకుని తీవ్రంగా నష్టపోయారు రైతులు. ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నిక వేళ.. దొడ్లు వడ్ల అంశాన్ని తెరపైకి తెచ్చారు కేసీఆర్. ఎఫ్‌సీఐ కొత్తగా ఈ ప్రకటన చేసిందా.. లేక ఎప్పుడో చెప్తే కావాలనే కేసీఆర్ ఇప్పుడు బయటకు తీసుకువస్తున్నారా తెలియదు కానీ.. మరో సారి రైతులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు.
తాజాగా దొడ్డు వడ్లను కొనుగోలు చేయలేమని ఎఫ్‌సీఐ తెగేసి చెబుతోందన్న కేసీఆర్ సర్కార్ వాదన. ఐదేళ్లకు సరిపడా నిల్వలు తమ వద్ద ఉన్నాయని, రబీలో దొడ్డు వడ్లను కొనుగోలు చేయలేమని అంటున్నదని ఆయన తాజాగా ప్రస్తావించారు. రైతులు దొడ్డు వడ్లు కాకుండా.. ఇతర ప్రత్యామ్నాయ పంటలు వేయాలని, ఆవిధంగా వారిని సమాయత్తం చేయాలని అధికారులకు సూచించారు. అయితే ఈ విషయంపై రాష్ట్ర బీజేపీ నేతలు స్పందించకపోవడంతో.. నిజమేనన్న అభిప్రాయం బలపడుతోంది. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తాజా నిర్ణయాలు రైతులని తీవ్ర ఆగ్రహానికి గురి చేస్తున్నాయి. దేశంలో నిల్వలు పేరుకుపోతే.. ఇతర దేశాలకు ఎగుమతి చేసే ప్రయత్నం చేయకుండా, వాటిని మరో విధంగా వినియోగించే ఆలోచన ఏదీ లేకుండా.. దొడ్డు వడ్లు వేయొద్దని చెబితే ఎలా అని రైతులు ప్రశ్నిస్తున్నారు.
రాష్ట్రంలో చాలా వరకు వరి పంటకు అనుకూలమైన నేలలే ఉన్నాయి. కొన్నిచోట్ల ప్రత్యామ్నాయ పంటలు వేస్తే సరైన దిగుబడి వచ్చే అవకాశమే లేదు. అసలు పెట్టుబడి వస్తుందన్న నమ్మకం కూడా లేదు. ఇక దశాబ్ధాలుగా కాల్వల వెంట సాగు చేసే చాలా మంది రైతులకు.. వరి తప్ప వేరే పంట వేయాల్సిన అవసరం రాలేదు. ఇతర పంటలను పండించే పరిజ్ఞానాన్ని కూడా పెంచుకోలేదు. ఇలా ఉన్నట్టుండి వేరే పంటలు వేయాలని చెబితే.. ఎలా అని వారు ప్రశ్నిస్తున్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి.. తమ నోట్లో మన్ను కొట్టేలా ఉన్నాయని మండిపడుతున్నారు.