బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి జాతీయ మహిళా కమిషన్ ఎదుట హాజరయ్యారు. తెలంగాణ గవర్నర్ పై తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చేందుకు ఆయన ఈరోజు కమిషన్ కార్యాలయానికి వెళ్లారు. అంతకు ముందు గవర్నర్ పై కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కమిషన్ సుమోటోగా స్వీకరించింది.
ఈ మేరకు ఆయనకు కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఆయన వ్యాఖ్యలు తమిళిసై గౌరవాన్ని కించపరిచేలా ఉన్నాయని కమిషన్ నోటీసుల్లో పేర్కొంది. విచారణకు హాజరు కాకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని కమిషన్ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఆయన ఈ రోజు కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు.
గత నెలలో కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో కౌశిక్ రెడ్డి పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… రాష్ట్ర శాసనసభ, మండలి ఆమోదించి పంపిన బిల్లులను గవర్నర్ తన వద్దే పెట్టుకున్నారని ఆయన మండిపడ్డారు.
బిల్లుకు ఆమోదం తెలుపకుండా ఫైల్స్ ను గవర్నర్ తన సీటు కిందే పెట్టుకున్నారంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై దుమారం రేగింది. ఆయనపై చర్య తీసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో దాన్ని జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది.