టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తున్నా.. హుజురాబాద్ టీఆర్ఎస్ లీడర్ కౌశిక్ రెడ్డి మనసు మాత్రం ఇంకా ఎమ్మెల్యే పదవి చుట్టూనే తిరుగుతున్నట్టుంది. కార్యకర్తలతో జై కొట్టించుకోలేని పోస్ట్ వేస్ట్ అని ఆయన భావిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్. ఉప ఎన్నికకే పరిమితమని… తన అనుచరులతో కౌశిక్ రెడ్డి చెప్తున్నట్టుగా తెలుస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా హుజురాబాద్ టికెట్ తనకే వస్తుందని వారితో అంటున్నట్టుగా చర్చ జరుగుతోంది.
ఎందరెందరో సీనియర్లు పదవుల కోసం చకోరా పక్షుల్లా ఎదురుచూస్తున్నా.. వారందరినీ పక్కనబెట్టి కొత్తగా వచ్చిన కౌశిక్ రెడ్డిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేశారు కేసీఆర్. మొన్నే వచ్చి.. పదవి తన్నుకుపోయాడని ఇప్పటికే ఆయనపై గులాబీ నేతలు చాలా మంది గరంగరం అవుతున్నారు. కౌశిక్ రెడ్డికి ఉన్నంత విలువ కూడా తమకు లేకుండాపోయిందా అని ఆవేదన చెందుతున్నారు. కానీ కౌశిక్ రెడ్డిలో మాత్రం ఎమ్మెల్సీ పదవి వస్తున్నా.. ఏ మాత్రం సంతోషం కనిపించడం లేదని అంటున్నారు ఆయన సన్నిహితులు.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అంటే.. క్యాడర్ లేని పోస్ట్ అని.. ఎక్కడికి వెళ్లినా ఎమ్మెల్యేతో ప్రోటోకాల్ ఇష్యూ ఫేస్ చేయాల్సి వస్తుందని కౌశిక్ రెడ్డి అనుకుంటున్నారట. జనంతో జేజేలు కొట్టించుకోలేని పదవితో మైలేజీ పెరగదని భావిస్తున్నారట. ఎమ్మెల్సీగా తన ఆరేళ్ల పదవీ కాలం పూర్తయిన తర్వాత… టీఆర్ఎస్‌లో తాను ఎక్కడ ఉంటానో కూడా తెలియదని… అందుకే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎమ్మెల్సీ పదవిని వదిలేసి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పుకుంటున్నారట. అందుకే ఈసారి తన చేతి నుంచి తప్పిపోయినా.. నెక్ట్స్ టైం మాత్రం టికెట్ తనకే వస్తుందని.. ఫాలోవర్లతో అంటున్నారట కౌశిక్ రెడ్డి.
ప్రస్తుతం హుజురాబాద్ గులాబీ దళంలో కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపైనే బిగ్ డిబేట్ నడుస్తోంది. గెల్లు శ్రీనివాస్ టెంపరరీ అని.. రెండేళ్ల తర్వాత ఎన్నికల్లో తనకే టికెట్ అని చెప్తే.. ఓట్లు ఎలా వేస్తారని సొంత పార్టీ కార్యకర్తలే గుసగుసలాడుకుంటున్నారు. కౌశిక్ రెడ్డి మాటలు బలం కాకపోగా.. నష్టం చేసే విధంగా ఉన్నాయని వాపోతున్నారు.