కేంద్ర ప్రభుత్వం నిన్న పద్మ అవార్డులను ప్రకటించింది. నలుగురికి పద్మవిభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 107 మందికి పద్మశ్రీ పురస్కారాలు వచ్చాయి. అయితే.. ఇందులో తెలంగానకు చెందిన ఆదీవాసీ బిడ్డ సకిని రామచంద్రయ్యను పద్మశ్రీ పురస్కారం వరించింది. ఆయన కోయభాషలో కోయ తెగల వంశ చరిత్రలను పారాయణం చేస్తాడు. దీన్ని ప్రభుత్వం గుర్తించి అత్యున్నత పురస్కారానికి ఆయన్ని ఎంపిక చేసింది. దీంతో.. తెలంగాణ సమాజం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అంతరించిపోతున్న కళను ప్రభుత్వం గుర్తించిందని ఆదివాసీ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం కూనవరం గ్రామానికి చెందిన సకిని రామచంద్రయ్య.. కోయ తెగలోని డోలి ఉపకులానికి చెందిన వారు. ఆయన తల్లిపేరు సకిని గంగమ్మ, తండ్రి సకిని ముసలయ్య. ఈ గిరిజన సాంప్రదాయ కళ రామచంద్రయ్యకు వారసత్వంగా వచ్చింది. దీన్నే ఆయన జీవనాధారంగా మార్చుకున్నాడు. ఆయన భార్య పేరు బసవమ్మ. వారికి ముగ్గురు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నారు.
ప్రస్తుతం ఆయన వయసు 65 ఏళ్లు. రామచంద్రయ్య అసలు చదువుకోకపోయినా.. కోయ తెగల వంశాల చరిత్రను తన పాట రూపంలో అద్భుతంగా వర్ణిస్తాడు. ఆయన పాటలు వినేందుకు ఆదివాసులు ఎంతగానో ఎదురుచూస్తారు. రామచంద్రయ్య తన ప్రతిభని ఒక్క తెలంగాణకే పరిమితం చేయలేదు. ప్రదర్శనలు ఇవ్వడానికి ఛత్తీస్‌గఢ్‌కు కూడా వెళ్లేవారు. ఒక్క సమక్క సారలమ్మల చరిత్ర, గరికామారాజు, పగిడిద్దరాజు, ఈరామరాజు, గాడిరాజు, నాగులమ్మ, సదలమ్మ, బాపనమ్మ, ముసలమ్మ.. ఇలా ఆదివాసీలు దేవతలగా పూజించే ప్రతీఒకరి జీవిత చరిత్రలను కూడా పాడి వినిపిస్తాడు. గిరిజన ప్రాంతాల్లో ఉండే ప్రతీ ఉపవిభాగాల చరిత్ర కూడా ఆయనకు తెలుసు. ప్రతీ ఇంటి పేరు వెనక ఉన్న కథని క్షణాల్లో పాటగా మార్చేస్తాడు. ప్రతీ ఏడాది జరిగే మేడారం సమ్మక్క సారక్క జాతరకి ప్రభుత్వం నుంచి రామచంద్రయ్యకు ప్రత్యేక ఆహ్వానం వస్తుంది.
రామచంద్రయ్యకు కేంద్రం ప్రభుత్వం పద్మ అవార్డు ప్రకటించడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఇది తనకు లభించిన గౌరవం కాదని.. అంతరించిపోతున్న ఆదివాసీ గిరిజన సంస్కృతి సంప్రదాయల కళకు అందిన గౌరవం అని రామచంద్రయ్య అన్నాడు. వంశపారంపర్యంగా ఈ కళ తనకు వంటపట్టిందని చెప్పారు. గిరిజన కళలు సంప్రదాయాలు అంతరించిపోతున్న ఈ రోజుల్లో ప్రభుత్వాలు డోలు వాయిద్యాన్ని కళగా గుర్తించి పద్మశ్రీ పురస్కారాన్ని ఇవ్వడంపై ఆనందం వ్యక్తం చేశాడు. రామచంద్రయ్యకు కేంద్రం ఈ అవార్డు ప్రకటించడంపై ఆదివాసీ ప్రజలే కాకండా యావత్ తెలంగాణ సమాజం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి వనజీవి రామయ్య తర్వాత పద్మశ్రీ అందుకోబోతున్న రెండో వ్యక్తిగా రామచంద్రయ్య చరిత్రలో నిలిచిపోతారని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ చెప్పారు. అటు ఎంపీ నామానాగేశ్వరరావు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు.