ప్రతిష్టాత్మక పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. తాజాగా ప్రకటించిన పద్మ అవార్డులకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి పలువురు ఎంపికయ్యారు. వీరిలో చినజీయర్ స్వామిజీతో పాటు ఎంఎం కీరవాణి ఉన్నారు. మొత్తంగా ఈ ఏడాది 106 మంది ప్రముఖులకు పద్మ అవార్డులు ప్రకటించగా.. ఇందులో 6 మందికి పద్మ విభూషణ్, 9 మందికి పద్మభూషణ్, 91 మందికి పద్మశ్రీలు ప్రకటించారు.
తాజాగా ప్రకటించిన పద్మ అవార్డుల్లో పలువురు తెలుగువారికి చోటు దక్కింది. ఇందులో తెలంగాణ నుంచి ప్రొఫెసర్ బి రామకృష్ణారెడ్డి పద్మ శ్రీ అవార్డుకు ఎంపిక కాగా, ఏపీ నుంచి సామాజికి కార్యకర్త సంకురాతిరి చంద్రశేఖర్‌ను పద్మశ్రీ వరించింది. గిరిజన భాషలన పరిరక్షించినందుకు రామకృష్ణారెడ్డికి పద్మశ్రీ అవార్డు దక్కగా, వైద్య విద్యా రంగంలో పేదలకు ఉచిత సేవలు అందించినందుకు గాను చంద్రశేఖర్‌కు పద్మశ్రీ పురస్కారం లభించింది.
ఆధ్యాత్మిక రంగంలో తెలంగాణ నుంచి స్వామి చినజీయర్ తో పాటు ఇదే రంగంలో తెలంగాణకు చెందిన కమలేష్ డి పటేల్ కు పద్మభూషణ్ పురస్కారం దక్కాయి. ఇక సైన్స్ ఇంజనీరింగ్ రంగంలో తెలంగాణకు చెందిన మోదడుగు విజయ గుప్తాకు పద్మశ్రీ పురస్కారానికి ఎంపికవ్వగా.. ఇదే రంగంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన గణేష్ నాగప్ప కృష్ణ నారా జనగరకు కూడా దక్కింది. మెడిసిన్ విభాగంలో తెలంగాణకు చెందిన పసుపులేటి హనుమంతరావుకు పద్మశ్రీ పురస్కారం వచ్చింది.
కళా రంగంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన సి.వి రాజుకు పద్మశ్రీ పురస్కారం రాగా.. సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన అబ్బా రెడ్డి నాగేశ్వరరావుకు పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు. కళా రంగంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన కోట సచ్చిదానంద శాస్త్రికి పద్మశ్రీ పురస్కారం వరించింది. సామాజిక సేవా రంగంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన సంకురాత్రి చంద్రశేఖర్ కు పద్మశ్రీ పురస్కారం దక్కింది. సంగీత దర్శకుడు ఎం. ఎం కీరవాణికి ఏపీ నుంచి పద్మ శ్రీ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ మేరకు కేంద్రం వివరాలను వెల్లడించింది.
పద్మ అవార్డులు వరించిన తెలుగు వారు: చినజీయర్ స్వామి, కమలేశ్ డి పటేల్ పద్మభూషణ్, మోదడుగు విజయ్ గుప్తా, ఎంఎం కీరవాణీ, గణేశ్ నాగప్ప హనుమంత్ రావ్, సీవీ రాజు అబ్బారెడ్డి నాగేశ్వరరావు బీ రామకృష్ణారెడ్డి, కోటా సచ్చితానంద శాస్త్రి, చంద్రశేఖర్ లకు పద్మశ్రీ అవార్డులు దక్కాయి.