యూపీలో బీజేపీ గురువారం అఖండ విజయాన్ని సాధించింది. బీజేపీ విజయానికి బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి, ఎంఐఎం చీఫ్ అసదుద్దిన్ ఓవైసీలు పరోక్షంగా కారణమయ్యారని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ట్వీట్ చేశారు.
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గొప్ప విజయం సాధించిందన్నారు. అయినప్పటికీ సమాజ్ వాదీ పార్టీ సీట్లు 3 రెట్లు (42 నుంచి 125) వరకు పెరిగాయని తెలిపారు.
బీజేపీ విజయానికి మాయావతి, ఓవైసీలు సహకరించారు. అందువల్ల వారికి పద్మవిభూషణ్, భారత రత్న అవార్డులను ఇవ్వాలని ట్వీట్ లో ఎంపీ రౌత్ ఎద్దేవా చేశారు.
‘ బీజేపీ నాలుగు రాష్ట్రాల్లో విజయం సాధించింది. కానీ ఉత్తరాఖండ్ ఎన్నికల్లో ఆ పార్టీ ముఖ్యమంత్రి ఓడిపోయారు. ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఉపముఖ్య మంత్రులు గోవాలో ఓటమి పాలయ్యారు. పంజాబ్ లో ఆ పార్టీని పూర్తిగా తిరస్కరించారు” అని అన్నారు.
‘ ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సహా ఇతర అగ్రనేతలంతా పంజాబ్ లో ప్రచారం చేశారు. మరి పంజాబ్ లో ఎందుకు ఓడిపోయారు” అని ప్రశ్నించారు.