కర్ణాటకలో ఏ ప్రాజెక్టు చేపట్టాలన్నా కంట్రాక్టర్లు రాజకీయ నాయకులకు ముడుపులు ముట్టజెప్పాల్సిందే.. 40 శాతం కమీషన్ ఇవ్వాల్సిందే..అంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణలు నిజమేనని ఆ రాష్ట్ర కంట్రాక్టర్ల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మంజునాథ్ బాంబు పేల్చారు. చిత్రదుర్గ బీజేపీ ఎమ్మెల్యే తిప్పారెడ్డికి తాను 2019-2022 మధ్య ముడుపులుగా రూ. 90 లక్షలు చెల్లించానని ఆయన తెలిపారు. ఇందుకు ఆధారాలుగా తమ మధ్య జరిగిన ఆడియో సంభాషణల తాలూకు వీడియోలను బయటపెడతానన్నారు. తనవద్ద వాట్సాప్ రికార్డింగులు కూడా ఉన్నాయన్నారు.
రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులను చేబట్టాలంటే మొదట ఈ ఎమ్మెల్యే చేతులు తడపవలసిందే అన్నారు. సోమవారం బెంగుళూరులో మీడియాతో మాట్లాడిన మంజునాథ్.. కోవిడ్ పాండమిక్ సమయంలో ఓ ప్రాజెక్టు కోసం ఓ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరుకు తాను మొదట 10 శాతం కమిషన్ ను, రెండో కోవిడ్ వేవ్ సమయంలో మరో 10 శాతం కమిషన్ ను చెల్లించానన్నారు. ఈ అధికారికి, తిప్పారెడ్డికి మధ్య మంచి సంబంధాలున్నాయన్నారు.
పీడబ్ల్యుడీ బిల్డింగ్ నిర్మాణాన్ని తాను చేబట్టానని, కానీ మూడేళ్ళుగా ఫైనల్ బిల్లు తనకు రాలేదని ఆయన చెప్పారు. తనకెంత కమీషన్ రావాలో తిప్పారెడ్డి చేత్తో సైగలు చేసి చూపేవారన్నారు. మైనర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో 25 శాతం కమీషన్ తీసుకున్నారని, ఇతర కాంట్రాక్టర్లు కూడా తాము లంచంగా ఎంత ముట్టజెప్పామో తనకు చెప్పారని మంజునాథ్ తెలిపారు.
ఓ ప్రాజెక్టు కోసం తనకు 40 శాతం కమీషన్ ఇవ్వాలంటూ మాజీ మంత్రి కె.ఎస్. ఈశ్వరప్ప పెట్టిన వేధింపుల కారణంగా గత ఏడాది సంతోష్ పాటిల్ అనే కంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ నేపథ్యంలో మంజునాథ్ తాజాగా చేసిన ఆరోపణలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రాష్ట్రంలో బీజేపీ నేతల అవినీతి పెరిగిపోయిందని కాంగ్రెస్ వంటి విపక్షాలు పదేపదే దుయ్యబడుతున్నాయి. రాష్ట్రంలోని మఠాలకు గ్రాంట్లను విడుదల చేయాలంటే అధికారులు 30 శాతం కమీషన్ తీసుకుంటున్నారని లింగాయత్ పీఠాధిపతి ఒకరు లోగడ ఆరోపించారు.