భారత్ జోడో యాత్రలో విషాదం చోటు చేసుకుంది. పంజాబ్‌లోని లూథియానాలో ఈ రోజు యాత్రలో పాల్గొన్న సమయంలో కాంగ్రెస్ ఎంపీ సంతోక్ సింగ్ మరణించారు. సంతోక్ సింగ్ మృతి పట్ల ప్రధాని మోడీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ ఎంపీ సంతోక్ సింగ్ మరణంతో తాను కలత చెందినట్టు ప్రధాని మోడీ వెల్లడించారు. పంజాబ్ ప్రజలకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు, అనుచరులకు ప్రధాని తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
మరోవైపు సంతోక్ సింగ్ మృతిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. పార్టీ సీనియర్ నేత, ఎంపీ సంతోక్ సింగ్ హఠాన్మరణంతో తాను షాక్ కు గురైనట్టు వెల్లడించారు. సంతోష్ సింగ్ కష్టపడి పనిచేసే నేత అని, మంచి వ్యక్తి అని ఆయన అన్నారు.
సంతోక్ సింగ్ తన జీవితాన్ని ప్రజా సేవ కోసం అంకితం చేశారని పేర్కొన్నారు. ఈ విషాద సమయంలో సంతోక్ సింగ్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్టు చెప్పారు. ఈ రోజు లూథియానలో పాదయాత్రలో పాల్గొన్న ఎంపీ సంతోక్ సింగ్‌కు గుండె పోటు వచ్చింది. దీంతో ఆయన్ని ఆస్పత్రికి తరలించగా అక్కడే మరణించారు.