ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పై దాయాది దేశం పాకిస్తాన్ క్రికెటర్లు తమ అక్కసు వెళ్లగక్కుతున్నారు. తమ దేశంలో ఇలాంటి లీగ్ లేదనో లేక పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) కు ఇంతటి క్రేజ్ లేదనో.. లేదా ఇంకేవైనా కారణాలో గాని, నోటికేదొస్తే అది వాగుతున్నారు.
ఐపీఎల్ అంటే అంతా వ్యాపారమే అని.. అసలక్కడ క్రికెట్ ఎక్కడుంది..? అంటూ పాకిస్తాన్ ప్లేయర్లు వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ కూడా చేరాడు.
ఐపీఎల్ మీడియా హక్కుల ద్వారా బీసీసీఐ రూ. 48,390 కోట్లు ఆర్జించిన నేపథ్యంలో తన యూట్యూబ్ ఛానెల్ లో లతీఫ్ తన అక్కసు వెళ్లగక్కాడు. మనమిక్కడ క్రికెట్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు.. ఇక్కడ జరుగుతున్నదంతా వ్యాపారమే. ఇది సరైన పద్ధతి కాదంటూ కామెంట్స్ చేశాడు.
కాగా ఐపీఎల్ పై పాక్ క్రికెటర్లు కామెంట్స్ చేయడం ఇదేం కొత్త కాదు. ఇక్కడితోనే ఆగిపోయేదీ లేదు. రెండ్రోజుల క్రితం షాహిద్ అఫ్రిది మాట్లాడుతూ.. భారత్ లో క్రికెట్ కు మంచి మార్కెట్ ఉంది. అందుకే దానికి (బీసీసీఐ) ఆదాయం బాగుంది. ప్రపంచ క్రికెట్ లో బీసీసీఐ ఏం చెబితే అది చెల్లుతుందని నోరు పారేసుకున్నాడు.