పాకిస్తాన్ లో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం కీలక మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్టు పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ ఖాసిమ్ సూరి ప్రకటించారు.
మరో వైపు పార్లమెంట్ ను రద్దు చేయాలని దేశ అధ్యక్షుడు అరీఫ్ అల్వీకి ప్రధాని ఇమ్రాన్ లేఖ రాశారు. త్వరలోనే దేశంలో ఎన్నికలు నిర్వహించాలని ఆయన కోరారు.
ఇక అవిశ్వాస తీర్మానాన్ని డిప్యూటీ స్పీకర్ తిరస్కరించడంపై ప్రతిపక్షాలు ఫైర్ అయ్యాయి. ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నిర్వహించేంత వరకు జాతీయ అసెంబ్లీలో ఆందోళనకు దిగుతామని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నాయకుడు బిలావల్ భుట్టో జర్దారీ తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
‘ రాజ్యాంగాన్ని ప్రభుత్వం ఉల్లంఘించింది. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ కు ప్రభుత్వం అనుమతించలేదు. ఉమ్మడి ప్రతిపక్షాలు పార్లమెంట్ ను విడిచివెళ్లడం లేదు. మా లాయర్లు సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేస్తున్నారు’ అని ట్వీట్ లో పేర్కొన్నారు.
‘ అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ లో నెగ్గేంత బలం ప్రతిపక్షాలకు ఉందని ప్రపంచానికి తెలుసు. చివరి క్షణంలో, స్పీకర్ చట్టవిరుద్ధమైన చర్యలు తీసుకున్నారు. పాకిస్తాన్ చట్టాలను ఆయన ఉల్లంఘించారు, చట్టం ప్రకారం, అవిశ్వాస తీర్మానం ఈరోజు జరగాలి. మాకు చట్టబద్ధమైన హక్కులు ఇచ్చే వరకు జాతీయ అసెంబ్లీలో ధర్నా చేయాలని ఉమ్మడి ప్రతిపక్షం నిర్ణయించింది’ అని అన్నారు.