పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై పోలీసులు ఉగ్రవాద కేసు నమోదు చేశారు. ఆయన మద్దతుదారుల్లో 61 మందిని అరెస్ట్ చేశారు. ఇమ్రాన్ నివాసం వద్ద వీరికి, పోలీసులకు మధ్య పెద్దఎత్తున ఘర్షణలు జరిగాయి. ఇమ్రాన్ నేతృత్వం లోని పాకిస్తాన్ తెహ్రీఫ్-ఏ-ఇన్సాఫ్ కి చెందిన కార్యకర్తలను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేసి.. బాష్పవాయువు ప్రయోగించారు. ఇమ్రాన్ ఇంటికి దారి తీసే మార్గాల్లో వారు ఏర్పాటు చేసిన కాంక్రీట్ బ్లాకులను తొలగించినట్టు పోలీసు అధికారులు తెలిపారు.
పైగా వారు దారికి అడ్డంగా చెట్లను నరికివేశారని, టెంట్లు ఏర్పాటు చేశారని..ఇలా పోలీసులు ఇమ్రాన్ నివాసానికి చేరుకోకుండా అన్ని ప్రయత్నాలూ చేశారని వారు చెప్పారు. తోషిఖానా కేసులో ఇమ్రాన్ పై దాఖలైన కేసుకు సంబంధించి ఇస్లామాబాద్ హైకోర్టు విచారణ జరుపుతోంది.
ఈ అవినీతి కేసులో కోర్టు విచారణకు ముందు జుడిషియల్ కాంప్లెక్స్ వద్ద విధ్వంసానికి దిగడం, పోలీసులు, భద్రతా సిబ్బందిపై దాడి చేయడం, లా అండ్ ఆర్డర్ కు భంగం కలిగించినందుకు ఇమ్రాన్ తో బాటు మరికొంతమందిపై కూడా ఉగ్రవాద కేసు నమోదయింది.
ఈ కేసులో విచారణకు హాజరయ్యేందుకు ఇమ్రాన్ ఖాన్.. లాహోర్ నుంచి ఇస్లామాబాద్ వెళ్ళినప్పుడు కోర్టు వెలుపల ఘర్షణలు జరిగాయి. ఈ ఘటనల్లో 25 మందికి పైగా భద్రతా సిబ్బంది కూడా గాయపడ్డారు. శనివారం పోలీసులు లాహోర్ లో ఇమ్రాన్ నివాసాన్ని చుట్టుముట్టి నిర్వహించిన సోదాల్లో తుపాకులు, పెట్రోల్ బాంబులు, తదితర ఆయుధాలను కనుగొని వాటిని స్వాధీనం చేసుకున్నారు.