పాక్ లో అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ కు ముందు కీలక పరిణామం చోటు చేసుకుంది. పంజాబ్ గవర్నర్ మహమ్మద్ సర్వర్ ను పదవి నుంచి ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం తొలిగించింది.
‘ పంజాబ్ గవర్నర్ చౌదరీ మహమ్మద్ సర్వర్ ను పదవి నుంచి తొలగించాము. ఆయన స్థానంలో నూతన గవర్నర్ ను రాజ్యాంగం ప్రకారం త్వరలోనే నియమిస్తాము’ అని పాక్ మంత్రి ఫవాద్ హుస్సేన్ ట్వీట్ చేశారు.
పంజాబ్ ముఖ్యమంత్రి ఉస్మాన్ బుజ్దార్ రాజీనామాను సర్వర్ శుక్రవారం ఆమోదించారు. సీఎం పదవి కోసం అధికార పార్టీ నుంచి చౌదరీ పర్వేజ్ ఇలాహీ(ప్రస్తుత అసెంబ్లీ స్పీకర్), పీఎంఎల్-ఎన్ పార్టీ అభ్యర్థి హమ్జా షహబాజ్ కు మధ్య పోటీ నెలకొంది.
Advertisements
సర్వర్ పై పంజాబ్ అసెంబ్లీ స్పీకర్ పర్వేజ్ ఇలాహీ ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. పంజాబ్ సీఎం ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా ఉన్న పీఎంఎల్-ఎన్ పార్టీ హమ్జా షహబాజ్ కు మద్దతిస్తున్న అలీమ్ ఖాన్ గ్రూపునకు సర్వర్ సపోర్ట్ చేస్తున్నట్టు ఇమ్రాన్ ఖాన్ కు ఇలాహీ ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ప్రస్తుత సమయంలో గవర్నర్ గా తన విచక్షణాధికారాలను ఉపయోగించి ప్రత్యర్థులకు మేలు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.