పాకిస్తాన్ లోని పెషావర్ లో సోమవారం ఓ మసీదులో సూసైడ్ బాంబర్ తనను తాను పేల్చివేసుకోవడంతో కనీసం 46 మంది మరణించారు. దాదాపు 150 మంది గాయపడ్డారు. మధ్యాహ్నం 1.40 గంటల ప్రాంతంలో పోలీస్ లైన్స్ ఏరియా సమీపంలోని మసీదులో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో పేలుడు సంభవించిందని పోలీసువర్గాలు తెలిపాయి. . నగర పోలీసు ప్రధాన కార్యాలయం కూడా ఈ మసీదు ప్రాంగణంలోనే ఉందని, అందువల్ల మృతులు,గాయపడినవారిలో ఎక్కువమంది పోలీసులు కూడా ఉన్నారని తెలుస్తోంది.
ప్రార్థనల సమయంలో సూసైడ్ బాంబర్ ముందు వరుసలోనే ఉన్నాడని, అతడు తనను తాను పేల్చివేసుకోగానే అనేకమంది అక్కడికక్కడే మరణించడమో, గాయపడడమో జరిగిందని సెక్యూరిటీ అధికారులు వెల్లడించారు. పేలుడు ధాటికి మసీదులోని కొంతభాగం కుప్పకూలిపోగా పలువురు ఆ శిథిలాల కింద చిక్కుకుపోయారని వారు చెప్పారు.
అత్యంత భద్రత గల ఈ ప్రాంతంలోకి సూసైడ్ బాంబర్ ఎలా చొచ్ఛుకు వచ్చాడో తెలియడం లేదన్నారు. ఈ ఘటనలో గాయపడినవారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చునని భయపడుతున్నారు.
పేలుడుకు సంబంధించిన సమాచారం తెలియగానే ప్రధాని షెహ్ బాజ్ షరీఫ్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ దాడికి కారకులైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ.. ఇది టెర్రరిస్ట్ సూసైడ్ ఎటాక్ అని ట్వీట్ చేశారు.