ఈ ఏడాది సెప్టెంబర్ లో ఆసియా కప్ 2023 జరగనున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీకి పాకిస్తాన్ అతిథ్యమివ్వనుంది. అయితే టోర్నీ పాక్ లో జరుగుతుండడంతో టీమిండియా అక్కడ ఆడేందుకు నిరాకరించింది. దీంతో మొదట ఆసియా కప్ ను మరో వేదికకు మార్చాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ భావించింది. కానీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆసియా కప్ తమ దేశంలో నిర్వహించకపోతే ఈ ఏడాది చివర్లో భారత్ లో జరగనున్న వన్డే వరల్డ్ కప్ ను బహిష్కరిస్తామని కూడా తెలిపింది.
అటు బీసీసీఐ కూడా ఈ విషయం లో మొండి వైఖరితోనే ఉంది.దీంతో ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఇరు బోర్డుల మధ్య రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించింది.ఇందులో భాగంగానే గురువారం రాత్రి ఏసీసీ ఆధ్వర్యంలో పీసీబీ, బీసీసీఐ బోర్డులు సమావేశమయ్యాయి. ఈ నేపథ్యంలో టీమిండియా ఆసియా కప్ ఆడుతుందని.. టోర్నీ పాకిస్తాన్ లోనే జరుగుతుందని ఏసీసీ తెలిపింది.
అయితే భారత్ ఆడే మ్యాచ్‌లను మాత్రం మరో వేదిక పై నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. భారత్ ఆడే మ్యాచ్ లకు సంబంధించి ఒమన్, యూఏఈ ఇంగ్లండ్ శ్రీలంక పేర్లను పరిశీలించార. ఈ వేదికల్లో ఏదో ఒకటి ఫైనలైజ్ చేయనున్నట్లు తెలిసింది. ఒక వేళ టీమిండియా ఆసియా కప్ ఫైనల్ బెర్తు బుక్ చేసుకుంటే..ఫైనల్ కూడా మరో వేదికలో నిర్వహించాలని ఏసీసీ నిర్ణయించింది. ఇందుకు పీసీబీ కూడా అంగీకరించినట్లు ఏసీసీ ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ లెక్కన ఆసియా కప్ విషయంలో బీసీసీఐ తమ పంతం నెగ్గించుకున్నట్లే. మరోవైపు పీసీబీ మాత్రం ఏసీసీ ప్రతిపాదనకు అంగీకరించడంతో ఒక మెట్టు దిగినట్లయింది.ఇక ఏడాది చివర్లో వన్డే వరల్డ్ కప్ ఉండడంతో ఆసియా కప్ ను వన్డే ఫార్మాట్లోనే నిర్వహించాలని ఏసీసీ భావిస్తోంది.