పాకిస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పంజాబ్‌లోని కల్కర్హార్ సాల్ట్ రేంజ్ ప్రాంతంలో పెండ్లి బృందంతో వెళుతున్న బస్సు అదుపు తప్పి లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో 15 మంది మరణించగా, మరో 60 మందికి తీవ్రగాయాలయ్యాయి.
బస్సు ఇస్లామాబాద్ నుంచి లాహోర్ వెళ్తుండగా ఘటన జరిగింది. వివాహం ముగించుకుని లాహోర్ కు బయలు దేరిన బస్సు కల్కర్హార్ సాల్ట్ ప్రాంతానికి చేరుకోగానే బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. దీంతో బస్సు బోల్తా కొట్టింది.
బోల్తా కొట్టే సమయంలో ఎదురుగా వస్తున్న మూడు వాహనాలను బస్సు ఢీకొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బస్సులో నుంచి మృతులను, క్షతగాత్రులను బయటకు తీశారు.
క్షతగాత్రులను రావల్పిండి, ఇస్లామాబాద్ నగరాల్లోని ఆస్పత్రులకు తరలించినట్టు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.