ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై పాకిస్థాన్ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిదీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కరోనా కన్నా పెద్ద జబ్బు మోదీ హృదయంలో, మనసులో మత విద్వేషం ఉందని, మోదీ మత రాజకీయాలు చేస్తున్నారని ఆఫ్రిదీ ఆరోపణలు చేశారు. కరోనా వేళ ఆఫ్రిదీ ఫౌండేషన్ ద్వారా సేకరించిన విరాళాల ద్వారా పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో నిత్యావసరాల పంపిణీ కార్యక్రమంలో ఆఫ్రిదీ ఈ వ్యాఖ్యలు చేశారు. కశ్మీరీలపై మోదీ అఘాయిత్యాలు చేస్తున్నారని ఆరోపించారు.
మరోవైపు ఆఫ్రిదీ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ మండిపడ్డారు. ఆఫ్రిదీ, ఇమ్రాన్, బాజ్వా లాంటి జోకర్లు భారత్‌కు, మోదీకి వ్యతిరేకంగా విషం చిమ్ముతున్నారని గంభీర్ వ్యాఖ్యానించారు. ఏడు లక్షల సైన్యం, 20 కోట్ల జనాభా ఉన్న పాకిస్థాన్ 70 ఏళ్లుగా కశ్మీర్ కోసం బిచ్చమెత్తుకుంటోందన్నారు. జడ్జిమెంట్ డే వరకూ కశ్మీర్ దక్కబోదని హితవు పలుకుతూ బంగ్లాదేశ్ గుర్తుంది కదా అని గంభీర్ ప్రశ్నించారు. 1971లో జరిగిన యుద్ధంలో ఇండియన్ ఆర్మీ తూర్పు పాకిస్థాన్‌పై విజయం సాధించి బంగ్లాదేశ్‌ను ఏర్పాటు చేసింది. నాటి యుద్ధంలో లక్షమంది పాక్ సైనికులకు భారత్ క్షమాభిక్ష ప్రసాదించింది. లొంగిపోయిన లక్షమంది పాక్ సైనికులను క్షమించి వదిలిపెట్టింది. బంగ్లాదేశ్ ఏర్పాటును పాక్ అత్యంత అవమానకర పరాజయంగా భావిస్తూ ఉంటుండంటూ గంబీర్ ట్వీట్ చేశాడు.