పాకిస్తాన్ ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంతో సతమవుతోంది. దేశంలో గోదుమ పిండి కోసం ప్రజలు కొట్లాడుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. బలూచిస్తాన్, పీఓకే ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. ఇలాంటి క్రమంలో పాక్ ఆర్థిక శాఖ మంత్రి విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు.
తమది ఇస్లాం పేరిట ఏర్పడిన దేశమని ఆయన అన్నారు. దేశంలో ప్రస్తుత సంక్షోభ పరిస్థితులకు అల్లా బాధ్యుడంటూ ఆయన పేర్కొన్నారు. పాకిస్తాన్‌ను అల్లా సృష్టించారని పేర్కొన్నారు. దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత అల్లాదేనని చెప్పారు.
దేశాన్ని కాపాడడంతో పాటు అభివృద్ధి చేసి సంపన్న దేశంగా మార్చాల్సిన బాధ్యత కూడా అల్లాదేనని వెల్లడించారు. దేశంలో ప్రస్తుత సంక్షోభ పరిస్థితి నుంచి దేశాన్ని గట్టించేందుకు ప్రధాని నేతృత్వంలోని తమ ప్రభుత్వం తీవ్రంగా కష్టపడుతోందని ఆయన వ్యాఖ్యానించారు.
రాజధాని ఇస్లామాబాద్‌లో గ్రీన్ లేన్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ సర్వీసును మంత్రి ఇషాక్ దార్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. గత ప్రభుత్వాల నిర్ణయాలతోనే ప్రస్తుత ఆర్థిక సంక్షోభం ఏర్పడిందన్నారు.
నవాజ్ షరీఫ్ ప్రధానిగా ఉన్న కాలంలో దేశంలో ఆర్థిక పరిస్థితి బాగుండేదన్నారు. కానీ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు అడ్డగోలుగా నిర్ణయాలు తీసుకోవడంతో పరిస్థితి దిగజారిపోయిందని ఆయన అన్నారు. ఆ నిర్ణయాలతో ఏర్పడిన ఇబ్బందులను ఇప్పుడు తాము ఒక్కొక్కటిగా తొలగిస్తున్నామన్నారు.
ఆయన వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడంలో ఆర్థిక మంత్రి విఫలం చెందారని ఒప్పుకోవాల్సిన సమయం వచ్చిందని మండిపడుతున్నారు. ఆయన్ని ప్రభుత్వం పదవి నుంచి తీసి వేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.