పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషర్రఫ్ దుబాయ్ లోని ఆసుపత్రిలో ఆదివారం మరణించారు. ఆయన వయస్సు 79 సంవత్సరాలు. 2016 మార్చ్ నుంచి దుబాయ్ లో ప్రవాస జీవితం గడుపుతున్న ఆయన అరుదైన వ్యాధితో బాధ పడుతూ వచ్చారని , దీర్ఘకాలంగా ఆసుపత్రిలో చికిత్స పొందారని పాక్ జియో న్యూస్ తెలిపింది. 1999 నుంచి 2008 వరకు ఆ దేశ అధ్యక్షుడిగా వ్యవహరించిన ఆయనపై దేశద్రోహం కేసు నమోదైంది. రాజ్యాంగాన్ని రద్దు చేసినందుకు గాను 2019 లో ఆయనకు మరణ శిక్ష కూడా విధించారు.
అయితే లాహోర్ హైకోర్టు ఆ మరణశిక్షను రద్దు చేసింది. దివంగత మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో మర్డర్ కేసుకు సంబంధించి పరారీలో ఉన్న నేరస్తుడిగా ఆయనను ఆనాడే ప్రకటించారు. నిజానికి ముషర్రఫ్ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఆయన మృత్యువుకు చేరువలో ఉన్నారని గత ఏడాది జూన్ లోనే ఆయన కుటుంబ సభ్యులు ఓ ప్రకటనలో తెలిపారు.
1943 ఆగస్టు 11 న ఢిల్లీలో పుట్టిన ముషర్రఫ్ .. కరాచీలో చదివారు. అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయనపై ఎన్నోసార్లు హత్యా ప్రయత్నాలు జరిగాయి.
జమ్మూ కశ్మీర్ కు సంబంధించి లోగడ ఆయన నాలుగు సూత్రాల ఫార్ములాను ప్రకటించారు. కశ్మీర్ సమస్యను అంతర్జాతీయం చేయడానికి శతవిధాలా యత్నించారు. 1999 లో కార్గిల్ క్యాంపెయిన్ పేరిట ఆయన చేసిన యత్నాల నేపథ్యంలో పాక్ దళాలు నియంత్రణ రేఖ పొడవునా కీలక ప్రాంతాలను కైవసం చేసుకున్నాయి. దీంతో పాక్, భారత్ మధ్య యుద్ధం అనివార్యమైంది.