పాకిస్తాన్ లో పెట్రోలు, డీజిల్ ధరలు ఒక్కసారిగా కొండెక్కిపోయాయి. లీటరుకు వీటి ధరలను 35 రూపాయలు పెంచుతున్నట్టు పాక్ ఆర్ధిక మంత్రిత్వ శాఖ ఆదివారం ప్రకటించింది. ధరలపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్టు ఇటీవలే వెల్లడించిన ప్రభుత్వం.. రోజురోజుకూ రూపాయి విలువ తగ్గిపోతుండడంతో ఈ చర్య తీసుకోక తప్పలేదని పేర్కొంది. పాకిస్తాన్ ని ఆర్ధిక సంక్షోభం నుంచి గట్టెక్కించడానికి తీసుకోవలసిన చర్యలపై చర్చించేందుకు రేపో, మాపో అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) కి చెందిన అధికారుల బృందం ఈ దేశానికి రానున్న సందర్భంలో .. పెట్రో ఉత్పత్తుల ధరలను ప్రభుత్వం ఇలా ఒక్కసారిగా పెంచివేసింది.
ఫిబ్రవరి 1 నుంచి వీటి రేట్లను లీటరు 45 నుంచి 80 రూపాయలకు పెంచవచ్చునని, లేదా పెట్రోలు కొరత పెరిగిపోయి పెట్రోలు బంకులు మూతబడతాయని సోషల్ మీడియాలో వస్తున్న ఊహాగానాలను తమ చర్య తోసిపుచ్చినట్టయిందని ఆర్థిక శాఖ మంత్రి ఇషాక్ దర్ అన్నారు.
గ్లోబల్ మార్కెట్ లో ఇంధన వనరుల ధరలు అత్యధికంగా ఉన్నట్టు ఆయిల్, గ్యాస్ శాఖల అధికారులు పేర్కొన్నారని, వారి సిఫారసుల ఆధారంగా తాము పెట్రో ఉత్పత్తుల ధరలు పెంచాల్సివచ్చిందని ఆయన చెప్పారు. అంతర్జాతీయంగా పెరిగిన ఆయిల్ ధరలను, అలాగే పడిపోతున్న రూపాయి విలువను కూడా మేం పరిగణనలోకి తీసుకోవలసి వచ్చింది అని ఆయన చెప్పారు.
చమురు, డీజిల్ కృత్రిమ కొరత ఏర్పడుతున్నట్టు వార్తలు వస్తున్నాయని, అలాగే వీటి ధరలపై నియంత్రణ ఉండబోదని ఆయిల్, గ్యాస్ రెగ్యులేటరీ అథారిటీ పేర్కొందని, ఈ కారణంగా ఆ సంస్థ చేసిన సిఫారసులు, సూచనలను పురస్కరించుకుని తాము తక్షణమే వీటి రేట్లను పెంచామని ఇషాక్ దర్ వివరించారు. ప్రభుత్వం ఇలా ప్రకటిస్తుందని ముందే ఊహించిన అనేక నగరాల్లోని ప్రజలు పెట్రోలు, డీజిల్ కోసం బంకుల ముందు పెద్ద సంఖ్యలో బారులు తీరారు.