తీవ్రమైన ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్తాన్ ను గట్టెక్కించేందుకు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ-ఐఎంఎఫ్ చేస్తున్న యత్నాలు ఫలించేలా కనబడడం లేదు. బెయిల్ ఔట్ మార్గాల చిక్కుముడులు వీడడం లేదు. ఉభయ పక్షాల చర్చల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది. రూ. 900 బిలియన్ల ద్రవ్య లోటు ఇందుకు ప్రధాన సమస్యగా మారింది. పెట్రోలియం, ఆయిల్, లూబ్రికెంట్ ఉత్పత్తులపై 1 శాతం జీఎస్టీ రేట్లను పెంచాలని ఐఎంఎఫ్ కోరుతుండగా మొదట ప్రాథమిక ద్రవ్యలోటును తీర్చాలని పాక్ ప్రభుత్వం పట్టుబడుతోంది.
రూ. 900 బిలియన్లంటే ఇది స్థూల దేశీయోత్పత్తిలో ఒక శాతం .. పెట్రోలియం, ఆయిల్ వంటి ఉత్పత్తులపై జీఎస్టీ రేట్లను 17 నుంచి 18 శాతానికి పెంచాలన్న ఐఎంఎఫ్ సూచన కన్నా మొదట సవరించిన రుణ సంబంధ మేనేజ్మెంట్ ప్లాన్ ని ఒప్పందంలో చేర్చాలని పాక్ అధికారులు కోరుతున్నారు. 687 బిలియన్ రూపాయల ఇదివరకటి అదనపు సబ్సిడీ టార్గెట్ ని 605 బిలియన్ రూపాయలకు తగ్గించాలని సూచిస్తున్నారు.
అంటే ద్రవ్య సంబంధ అంతరం రూ. 400 బిలియన్ల నుంచి 450 బిలియన్లు ఉంది. పైగా నిధుల సాయానికి సంబంధించి మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ చైర్మన్ ఇమ్రాన్ ఖాన్ లోగడ కుదుర్చుకున్న అగ్రిమెంట్ ని పునరుద్ధరించి దానిపై పై సంతకం చేయాలన్న ఐఎంఎఫ్ షరతును ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని వారు స్పష్టం చేస్తున్నారు.
అసలు అలాంటి చర్చల ఊసే లేదని జియో న్యూస్ తెలిపింది. ఐఎంఎఫ్ అధికారుల బృందానికి, పాకిస్థాన్ ఆర్ధిక మంత్రిత్వ శాఖకు మధ్య విభేదాలు ఇంకా కొనసాగుతున్నాయని ఈ వార్తా సంస్థ వెల్లడించింది. సాంకేతికపరమైన చర్చలు సోమవారం కూడా జరుగుతాయని, మంగళవారం నుంచి పాలసీ స్థాయి చర్చలు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని పేర్కొంది. ఎక్స్ పోర్ట్ ఓరియెంటెడ్ రంగానికి గాను ఎలెక్ట్రిసిటీ, గ్యాస్ టారిఫ్ సబ్సిడీలను రద్దు చేయాలన్న ఐఎంఎఫ్ సూచనకు ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించినట్టు సంబంధిత వర్గాలను పేర్కొంటూ జియో న్యూస్ వివరించింది. ఈ నెల 9 న కూడా ఉభయ పక్షాల మధ్య చర్చలు జరగనున్నాయి.