ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో పాక్ ప్రజలు అల్లాడి పోతున్నారు. దేశంలో ఏది కొందామన్నా కొనబోతే కొరివి అన్నట్టుగా పరిస్థితి తయారైంది. ఆ దేశంలో గోధుమ పిండి దెబ్బకు అక్కడి ప్రజలు విలవిలలాడుతున్నారు. ఇక చికన్ ధరలు కొండెక్కి కూర్చున్నాయి. తాజాగా వీటికి తోడు బంగారం ధరలు భగ్గున మండిపోతున్నాయి.
పాక్‌లో 24 క్యారట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.2.06 లక్షలుగా ఉంది. అమెరికా డాలర్‌తో పోల్చితే పాకిస్థాన్ రూపాయి విలువ చాలా దారుణంగా పడిపోయింది. ఈ క్రమంలో బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని పాక్ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
డాలర్‌తో పాక్ రూపాయి మారకం విలువ రూ.280కి పైన ట్రేడవుతోంది. గత నెలలో ద్రవ్యోల్బణం 31.6 శాతం పెరిగిపోయింది. దీంతో పాక్ రిజర్వు బ్యాంకు 300 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లను పెంచేసింది. దేశం మరింత ఇబ్బందుల్లోకి కూరుకుపోకుండా అంతర్జాతీయ ద్రవ్యనిధితో ఆ దేశ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.
దీంతో పన్నులను ప్రభుత్వం భారీగా పెంచేసింది. పన్ను రేట్లు పెరగడంతో ధరలు కూడా మండిపోతున్నాయి. దేశంలో పాల ధర లీటరుకు రూ. 210కు చేరింది. ఇక చికెన్ వైపు చూడాలంటేనే పాక్ జనాలు భయపడి పోతున్నారు. చికెన్ కేజీ ధర రూ. 700 నుంచి రూ. 780 వరకు ఉంది. విదేశీ మారకద్రవ్యం నిల్వలు కూడా దారుణంగా పడిపోతున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో పాక్ ప్రజలు మరిన్ని గడ్డు పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.