తాలిబన్లకు ముందు నుండి సపోర్ట్ చేస్తున్న వారిలో ముందున్న దేశం పాకిస్తాన్. 1990లలో తాలిబన్ల పరిపాలనకు కూడా పాక్ ఫుల్ సపోర్ట్ చేసింది. ఇటీవల అమెరికా బలగాలు అఫ్ఘన్ నుండి వెళ్లిపోయాక పాక్ ఆర్మీ చీఫ్ వరుసగా కాబూల్ లో పర్యటిస్తున్నారు.
పంజ్ షీర్ వ్యాలీలో తాలిబన్లకు చుక్కలు చూపిస్తున్న ప్రతిఘటన దళాలను ఏరివేయటంలో పాక్ కూడా సహయం చేస్తోంది. పంజ్ షీర్ లో తలదూర్చవద్దని ఇరాన్ పాక్ ను హెచ్చరిస్తున్నా… పాక్ కు చెందిన వైమానిక దళాలు తాలిబన్లకు మద్ధతుగా పనిచేస్తూనే ఉన్నాయి.
మరోవైపు ప్రభుత్వ ఏర్పాటులో తాలిబన్ల అగ్ర నాయకత్వం మధ్య విభేదాలు పొడచూపాయి. ముల్లా బరాదర్ ప్రధాని అవుతారని అంతా భావించినా… తమతో సఖ్యతతో ఉండే నేతను ఎంపిక చేయాలని పాక్ ఒత్తిడి తెస్తున్నట్లు కథనాలు వినిపిస్తున్నాయి. హక్కానీలు పాక్ కు వంత పాడుతున్నారని, ఉగ్రవాద సంస్థలతో హక్కానీలకు మెరుగైన సంబంధాలున్నట్లు స్పష్టం చేస్తున్నాయి. దీంతో మధ్యే మార్గంగా తాలిబన్ టాప్ లీడర్ హిద్బతుల్లా ప్రధాని కావొచ్చని తాలిబన్ వర్గాలు పేర్కొంటున్నాయి.