భారత ప్రధాని మోడీపై పాక్ మీడియా ప్రశంసల జల్లు కురిపిస్తోంది. ప్రధాని మోడీ అవలంభిస్తున్న ఆర్ధిక విధానాలను, విదేశాంగ నీతి విషయంలో మోడీని ఆకాశానికి ఎత్తాయి. ప్రధాని మోడీ నాయకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో భారత్ తనదైన ముద్ర వేస్తోందని పాక్ పత్రిక ట్రిబ్యూన్ పొగడ్తలతో ముంచెత్తింది.
మోడీ హయాంలో భారత్‌లో వ్యవసాయ ఉత్పత్తులు రికార్డు స్థాయిలో అత్యున్నత స్థాయికి పెరిగాయన్నారు. మోడీ కృషితో ఐటీ పరిశ్రమ కూడా చెప్పుకోదగిన స్థాయిలో విస్తరించిందన్నారు. కాలం పెట్టిన పరీక్షలను ఎదుర్కొని భారత ప్రజాస్వామ్యం దృఢంగా నిలిచిందన్నారు.
భారత ప్రతిష్టను మోడీ పెంచుకుంటూ పోతున్నారంటూ షహజాద్ చౌధరి అనే రాజకీయ, భద్రత, రక్షణ విశ్లేషకుడు తన ఆర్టికల్‌లో వెల్లడించారు. తన నైపుణ్యంతో భారత జీడీపీని 3 ట్రిలియన్ డాలర్లకు మోడీ పెంచారంటూ ఆయన ప్రస్తావించారు. మోడీ విదేశాంగ విధానాలు అశ్చర్యం కలిగిస్తున్నాయంటూ కితాబిచ్చారు.
ఇటీవల పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా ప్రధాని మోడీపై ప్రశంసల జల్లు కురిపిస్తూ వచ్చారు. విదేశాంగ విధానంలో భారత్ స్వేచ్ఛగా, స్వతంత్రంగా వ్యవహరిస్తుందని ఇమ్రాన్ ఖాన్ కొనియాడారు. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు విషయంలో అమెరికా నుంచి వ్యతిరేకత వచ్చినా భారత్ ఎక్కడా వెనక్కి తగ్గలేదన్నారు.