పాకిస్తాన్ తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకుంది. పతనం అంచున ఉన్న పాక్ ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు తమ ప్రజలు టీ వినియోగాన్ని తగ్గించుకోవాలని ప్లానింగ్, అభివృద్ధి, ప్రత్యేక కార్యక్రమాల మంత్రి అహ్సాన్ ఇక్బాల్ దేశ ప్రజలను కోరారు. దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడే ప్రయత్నంలో “ఒక కప్పు టీని తగ్గించమని నేను దేశ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను” అని మంత్రి పేర్కొన్నారు. దీంతో పాకిస్తాన్ ప్రభుత్వం నిరాశ, నిస్పృహలు ఎంతటి పతాక స్థాయికి చేరుకున్నాయనేది వెల్లడైంది.
ప్రస్తుతం పాకిస్థాన్ పెను విపత్తు అంచున కొట్టుమిట్టాడుతోంది. ఒక పక్క తీవ్రవాదంతో ముడిపడి ఉన్న దీర్ఘకాల రాజకీయ సంక్షోభం ఉంటే.. మరోపక్క నిరంతర ఆర్థిక సంక్షోభంతో ఆందోళన చెందుతోంది. ఈ సమయంలోనే పాక్ కు సన్నిహిత మిత్రదేశం చైనా కూడా ఆపదలో ఆదుకునే స్థితిలో లేకపోవడంతో పాక్ పరిస్థితి మరింత దుర్భరంగా మారింది.
2021-22 ఆర్థిక సంవత్సరంలో పాకిస్తాన్ ప్రజలు రూ. 83.88 బిలియన్ల విలువైన తేయాకుని వినియోగించినట్లు లెక్కలు చెప్తున్న నేపథ్యంలో మంత్రి అహ్సన్ ఇక్బాల్ దేశ ప్రజలకు ఈ మేరకు పిలుపునిచ్చారు. ప్రపంచంలో అత్యధికంగా తేయాకును దిగుమతి చేసుకుంటున్న దేశం పాకిస్తాన్ అని.. దీని దిగుమతి కోసం ప్రభుత్వం అప్పులు చేయాల్సి వస్తోందని తెలిపారు.
Advertisements
రుణంపై తేయాకు దిగుమతి చేసుకుంటున్న కారణంగా రోజుకు 1 లేదా 2 కప్పుల తేనీటికి ప్రజలు పరిమితం కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అయితే.. మంత్రి వ్యాఖ్యలపై ఆ దేశ ప్రజలు మండిపడుతున్నారు. ట్విటర్ లో ఆయనపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. తాము టీ తాగడం తగ్గించే ప్రసక్తి లేదని వారు తెగేసి చెప్తున్నారు.