పాకిస్థాన్ ప్రభుత్వం ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు నానాతంటాలు పడుతోంది. ఈ ప్రయత్నంలో భాగంగా ఇమ్రాన్ ప్రభుత్వం ఓ కొత్త పథకాన్ని అమలు చేస్తుంది. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి ఈ కొత్త పథకాన్ని తీసుకొని వచ్చింది. విదేశీ పౌరులకు పాకిస్తాన్‌లో శాశ్వత నివాస పథకాన్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పథకం ఈ నెల 15నుంచి ప్రారంభం అయింది. వీదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, వీదేశీ మారకద్రవ్యనిల్వలు పెంచుకోవడానికి పాక్ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే పాకిస్థాన్ చరిత్రలో రియల్ ఎస్టేట్ రంగంలో విదేశీ పెట్టుబడులు పెట్టడానికి అనుమతించడం ఇదే మొదటి సారి.
అమెరికా, కెనడా, ఆఫ్ఘన్, చైనా దేశాలే లక్ష్యంగా ఈ స్కీమ్ ను ప్రవేశపెడుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అక్కడి ధనిక వర్గాలు టర్కీ, మలేషియాకి వెళ్లిపోతున్నారు. వారిని ఆకర్శించడానికే ఈ ఇమ్రాన్ ఈ పథకం తీసుకొచ్చారని అంటున్నారు. పాక్ లోనే వారికి శాశ్వత నివాసం కల్పిస్తే దేశ ఆర్థిక వృద్దిలో వారు భాగం అవుతారని పాక్ ప్రభుత్వం ఆలోచన.
మరోవైపు కెనడాలో ఉన్న సిక్కులను కూడా ఈ పథకం ద్వారా పాక్ ఆకర్షించే అవకాశం ఉందని చెబుతున్నారు. కొందరు సిక్కులు మతపరమైన ప్రదేశాలలో, ముఖ్యంగా కర్తార్‌పూర్ కారిడార్‌లో పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. వారిని ఆకర్షించే లక్ష్యంగా పాక్ ఈ పథకం ప్రవేశ పెట్టిందనే వాదనలు ఉన్నాయి.
పాకిస్తాన్‌లో పారిశ్రామిక యూనిట్లను చైనాకు అప్పగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే వాదన కూడా లేకపోలేదు. చైనాలో ఉన్న కొంతమంది దనిక వర్గాల ప్రజలను ఈ పథకం ద్వారా పాక్ లోకి ఆహ్వానించి వారి ప్రాముఖ్యతను పెంచాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. ప్రభుత్వం అనుకున్నట్టు ఈ పథకం ద్వారా విదేశీయులను ఆకర్షిస్తే పాక్ కొంత మేర మెరుగుపడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.