దాయాది దేశం పాకిస్తాన్ ఇతర విషయాల్లో కాకపోయినా.. క్రికెట్ లో మాత్రం భారత్ కు గట్టి పోటీనిస్తుంటుంది. ఈ రెండు దేశాల మధ్య మ్యాచ్ అంటే జనాలు టీవీల ముందే ఉంటారు. ప్రస్తుతం పాక్ జట్టు ఫుల్ ఫామ్ లో ఉంది. వరుస విజయాలు నమోదు చేస్తూ రికార్డులు సృష్టిస్తోంది. ఈ క్రమంలోనే ఐసీసీ ర్యాకింగ్స్ లో భారత్ ను దాటేసింది.
ఐసీసీ పురుషుల వన్డే జట్టు ర్యాంకింగ్స్‌లో భారత్ ను వెనక్కు నెట్టి నాలుగో స్థానానికి చేరింది పాక్ జట్టు. ఇటీవలే ముల్తాన్ లో వెస్టిండీస్ ను క్లీన్ స్వీప్ చేసిన పాకిస్తాన్. దీంతో.. తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్ లో 4 వ స్థానానికి చేరింది. భారత జట్టు ఐదో స్థానానికి పడిపోయింది.
వెస్టిండీస్ తో సిరీస్ ప్రారంభానికి ముందు 102 పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్న పాక్.. ఆ సిరీస్ ను 3-0 తో క్లీన్ స్వీప్ చేయడం ద్వారా 106 పాయింట్లకు ఎగబాకింది. ఫలితంగా నాలుగో స్థానానికి చేరుకుంది. భారత్ 105 పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతోంది.
ఆమధ్య జింబాబ్వే, దక్షిణాఫ్రికా జట్లపై 2-1 తేడాతో సిరీస్ విజయాలను సైతం సొంతం చేసుకుంది పాక్. అంతేకాకుండా 1998 తర్వాత తొలిసారి తమ గడ్డపై అడుగుపెట్టిన ఆస్ట్రేలియాను కూడా అంతే తేడాతో ఓడించింది.