గుణపాఠం నేర్చుకున్నామని, ఇండియాతో శాంతిని కోరుకుంటున్నామని పాకిస్తాన్ ప్రధాని షెహ్ బాజ్ షరీఫ్ ప్రకటించి 24 గంటలైనా కాలేదు. ఆయన కార్యాలయం మాత్రం అప్పుడే కశ్మీర్ వివాదాన్ని లేవనెత్తింది. కశ్మీర్ కి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370 ని రద్దు చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకున్న పక్షంలోనే తాము చర్చలకు సిద్ధమని ప్రధానమంత్రి కార్యాలయం ఓ స్టేట్మెంట్ లో తెలిపింది. 2019 ఆగస్టు 5 న కేంద్రంతీసుకున్న ఈ చర్యను రద్దు చేస్తే తప్ప.. ఇండియాతో సంప్రదింపులు సాధ్యం కాదని షరీఫ్ కార్యాలయం పేర్కొంది.
ఉభయ దేశాల మధ్య చర్చలకు ముందు ఇండియా ఇందుకు పూనుకోవాలని సూచించింది. కశ్మీర్ వివాద పరిష్కారం ఐక్యరాజ్యసమితి తీర్మానాలకు లోబడి ఉండాలని, కశ్మీర్ ప్రజల ఆశయాలను తీర్చే దిశగా చర్చలు సాగాలని ఈ కార్యాలయ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. యూఏఈ లో ఓ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ ప్రధాని షరీఫ్ ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారని ఆయన పేర్కొన్నారు. దీన్ని బట్టి చూస్తే పాకిస్థాన్ యూ టర్న్ తీసుకున్నట్టే కనబడుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
షరీఫ్ మాత్రం ఈ ఇంటర్వ్యూలో కొత్తపల్లవినెత్తుకున్నారు. భారత, పాకిస్తాన్ దేశాల మధ్య చర్చలు జరిగేలా చూడడంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్యవర్తిత్వం వహించాలని ఆయన కోరారు.
ఉభయ దేశాలను సంప్రందింపులకు ఒప్పించేలా యూఏఈ అధ్యక్షుడు మహ్మద్ బిన్ జాయేద్ అల్-నహ్యాన్ జోక్యం చేసుకోవాలని తాను కోరినట్టు ఆయన చెప్పారు. మహ్మద్ బిన్ జాయేద్ ని ‘పాకిస్తాన్ సోదరుడిగా’ అభివర్ణించారు. ఇండియాతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయని, అందువల్ల ఈ విషయంలో ఆయన కీలక పాత్ర వహించగలరని షరీఫ్ పేర్కొన్నారు.