ఓ వైపు ఘోర భూకంప తాకిడితో కుంగిపోయి ప్రపంచ దేశాల నుంచి సాయం కోసం టర్కీ ఆర్తిగా ఎదురు చూస్తుండగా మరో వైపు పాకిస్తాన్ చేసిన నిర్వాకం ఆ ప్రభుత్వాన్ని షాక్ కి గురి చేసింది. . గత ఏడాది పాకిస్తాన్ ని భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేసినప్పుడు బాధితులను ఆదుకునేందుకు టర్కీ ప్రభుత్వం తమ దేశం నుంచి సహాయ సామాగ్రిని యుద్ధ ప్రాతిపదికన పాక్ కు పంపింది. నాడు ఆ వరదల్లో అనేకమంది పాకిస్తానీయులు మరణించగా ..వేలమంది నిరాశ్రయులయ్యారు.
అయితే టర్కీ నుంచి అందిన సాయాన్ని ఇప్పుడు పాక్ ప్రభుత్వం తిరిగి అదే దేశానికి పంపిన వింత వైనాన్ని షాహిద్ మసూద్ అనే జర్నలిస్టు వెలుగులోకి తెచ్చాడు. ఇటీవల తమ దేశం నుంచి సహాయ సామగ్రితో కూడిన విమానాలు టర్కీకి వెళ్లాయని, కానీ ఈసాయం లోగడ ఆ దేశం నుంచి తమకు అందినదేనని ఆయన వెల్లడించాడు.
పాక్ లోని జీఎన్ఎన్ న్యూస్ ఈ దిగ్భ్రాంతికరమైన వార్తను ప్రచురించింది. నాడు టర్కీ రాజధాని అంకారా నుంచి అందిన సాయంలో పాక్ అధికారులు సామాగ్రి కి సంబంధించిన బయటి బాక్సులను మాత్రమే మార్చి.. లోపలి వాటిని మార్చడం మరిచిపోయారని షాహిద్ మసూద్ పేర్కొన్నాడు. ఇదే సాయాన్ని తిరిగి వారు టర్కీకి పంపినట్టు స్పష్టమైందన్నాడు.
తమ దేశ అధికారుల నిర్లక్ష్యాన్ని ఈ ఉదంతం నిరూపిస్తోందన్నాడు. టర్కీ భూకంప బాధితులను పరామర్శించేందుకు పాక్ ప్రధాని షెహ్ బాజ్ షరీఫ్, తమ విదేశాంగ మంత్రి బిలాల్ భుట్టోతో కలిసి ఈ నెల 16 న అంకారాకు వెళ్ళినప్పుడు అక్కడి విదేశాంగ కార్యాలయం ఈ విషయాన్ని వారి దృష్టికి తేగా వారిద్దరూ తెల్లముఖం వేసినట్టు తెలుస్తోంది. ఏమీ మాట్లాడలేక ‘రెడ్ ఫేస్’ తో కామ్ అయిపోయారని వార్తలు వచ్చాయి. టర్కీ, సిరియా భూకంపంలో మరణించినవారి సంఖ్య 45 వేలకు పైగా పెరిగినట్టు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.