అతి తక్కువ సమయంలోనే తాలిబన్లు ఆఫ్ఘాన్ ను హస్తగతం చేసుకోవడం ప్రపంచ దేశాలను ఆశ్చర్య పరిచింది. అయితే ఇది ఎలా సాధ్యమైందనే విషయాన్ని ఆరా తీస్తే మాత్రం సంచలన నిజాలు బయటకొస్తున్నాయి. ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం… భారత్ లో పనిచేస్తున్న పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద గ్రూపులు జైషే ఇ మహ్మద్, లష్కరే ఇ తైబా.. తాలిబాన్లకు క్యాడర్ ను సరఫరా చేస్తున్నట్లు వెల్లడైంది.
దాదాపు 20 ఏళ్ల తర్వాత తాలిబాన్లు ఆఫ్ఘాన్ ను ఆక్రమించారు. ఇప్పుడు ఆ దేశాన్ని ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ అని పిలుచుకుంటున్నారు. అయితే అమెరికా, నాటో దళాల ఉపసంహరణ ప్రకటించగానే అతి తక్కువ వ్యవధిలోనే తాలిబన్లు ఆఫ్ఘాన్ ను కమ్మేశారు. ఈ మొత్తం వ్యవహారంలో పాకిస్తాన్ సైన్యం, ఐఎస్ఐ, ప్రభుత్వం కీలక పాత్ర పోషించినట్లు కనిపిస్తోంది. అలాగే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద గ్రూపులు క్యాడర్ ను సమకూర్చిన్నట్లుగా ఇంటెలిజెన్స్ నివేదిక చెబుతోంది. అంతేకాదు పాక్ సైన్యం, ఐఎస్ఐ ఏకే 47 వంటి ఆయుధాలను కూడా సరఫరా చేశాయని అంటోంది.
ఇంటెలిజెన్స్ నివేదికలో ఉన్న సమాచారాన్ని బట్టి… పాకిస్తాన్ ఎల్ఈటీ, జేఎం శిక్షణా శిబిరాలను ఆఫ్ఘనిస్తాన్ కు మార్చింది. ఈ రెండు ఉగ్ర సంస్థలు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కింద ఉగ్రవాదులను చేర్చారు. పాకిస్తాన్ ఆధారిత ఐఎస్ఐకు చెందిన వారు ఎల్‌ఈటీ, జేఎం నెట్ వర్కులను నడుపుతూ తాలిబాన్లకు సాయం చేస్తున్నారు. వారికి సహాయ పడటానికి శిక్షణ పొందిన క్యాడర్ ని ఉగ్రవాద బృందాలు అందిస్తూ వచ్చాయి. ఆఫ్ఘనిస్తాన్, కాశ్మీర్ లో కార్యకలాపాల కోసం లష్కర్ ఉన్నతాధికారులు హఫీజ్ సయీద్, జాకీయుర్ రెహ్మాన్ లఖ్వీ నిధులను కూడా సేకరిస్తున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లోనే పాకిస్తాన్ మంత్రి షేక్ రషీద్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు అనుమానాలకు మరింత బలాన్ని చేకూర్చినట్లు అయింది. ఆఫ్ఘనిస్తాన్ లో శాంతి ప్రక్రియ కోసం పాకిస్తాన్ చేసిన కృషి చిరకాలం గుర్తుండి పోతుందని ఆయన అన్నారు. అమెరికా, తాలిబాన్లను చర్చల పక్రియలోకి తీసుకురావడంలో ముఖ్యమైన పాత్ర పోషించినందుకు ఏ దేశం పాకిస్తాన్ ను మర్చిపోదు అని అన్నారు రషీద్. మొదట్నుంచి తాలిబన్లను వెనకేసుకొస్తోంది పాకిస్తాన్. ఈ నేపథ్యంలోనే ఇంటెలిజెన్స్ ఇచ్చిన నివేదిక సంచలనంగా మారింది.