ఆర్ధిక సంక్షోభంతో విలవిలలాడుతున్న పాకిస్తాన్ తన ఖర్చులను తగ్గించుకునేందుకు ముమ్మర యత్నాలు ప్రారంభించింది. ఇంధనాన్ని ఆదా చేసుకునేందుకు పలు చర్యలు చేబట్టింది. ఇందుకు మొదట విద్యుత్ పై దృష్టి పెట్టిన తాము ఇకపై మాల్స్, మార్కెట్లు, వెడ్డింగ్ హాల్స్ లో , చివరకు ప్రభుత్వ ఆఫీసుల్లో కూడా విద్యుత్తును పొదుపుగా వాడాలని నిర్ణయించామని రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ తెలిపారు.
దీనివల్ల 30 శాతం విద్యుత్ ఆదా అవుతుందని, ఫలితంగా 62 బిలియన్ రూపాయలను ఆదా చేయగలుగుతామని ఆయన చెప్పారు. ఆయిల్ దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించుకునేందుకు, ఇంధనాన్ని ఆదా చేసేందుకు ‘నేషనల్ ఎనర్జీ కన్సర్వేషన్ ప్లాన్’ ని పాక్ కేబినెట్ నిన్న ఆమోదించింది.
దీని ప్రకారం రాత్రి 8.30 గంటలకల్లా మార్కెట్లు, మాల్స్, రాత్రి 10 గంటలకల్లా వెడ్డింగ్ హాల్స్ మూసివేయాలని నిర్ణయించారు. వచ్చే నెల 1 నుంచి ఎక్కువ కాంతినిచ్చే బల్బుల ఉత్పత్తిని,నాసిరకం ఫ్యాన్ల తయారీని జులై నుంచి నిలిపివేయాలని నిర్ణయించినట్టు ఆసిఫ్ చెప్పారు.
దీనివల్ల మరో 22 బిలియన్ రూపాయలు ఆదా అవుతాయన్నారు. గ్యాస్ వినియోగాన్ని తగ్గిస్తే 92 బిలియన్ రూపాయలు ఆదా కావచ్చునని భావిస్తున్నామన్నారు. ‘అసలు మేమంతా ఈ కేబినెట్ సమావేశాన్ని ‘ఎండ’ లోనే నిర్వహించాం’ అని ఆసిఫ్ చెప్పారు. ఇంధనాన్ని ఆదా చేయాలన్న నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందన్నారు. ఇలాంటి ప్లాన్ ని ప్రపంచంలోని ఇతర దేశాలు కూడా అనుసరిస్తున్నాయని ఆయన తెలిపారు. పాకిస్థాన్ లో ద్రవ్యోల్బణం 21-23 శాతం మధ్య ఉండగా.. మొదటి నాలుగు నెలలకు గాను.. జులై నుంచి అక్టోబరు మధ్య కాలంలో ద్రవ్య లోటు 115 శాతానికి పైగా ఉన్నట్టు అంచనా.
.