ఆమె ఇప్పటికే ముగ్గురు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. మరోసారి ఆడపిల్ల పుడితే తన భర్త తనను ఇంటి నుంచి తరిమివేస్తాడని భయపడింది. ఈ మేరకు పరిష్కారం కోసం ఓ దొంగ బాబాను ఆశ్రయించింది. ఆ దొంగ బాబా ఉపదేశాలు పాటించి తన ప్రాణాల మీదకు తెచ్చుకుంది. ఇంతకు ఆ బాబా ఏమని ఉపదేశించాడు. ఆ మహిళకు ఎందుకు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళింది అనుకుంటున్నారా అయితే ఈ వార్త చదవండి…
పోలీసుల వివరాల ప్రకారం… పాకిస్తాన్ లోని ఖైబర్ పంక్తూంక్వా ప్రావిన్స్ లో ఓ మహిళకు ముగ్గురు సంతానం. ముగ్గురూ ఆడపిల్లలే కావడంతో ఆమె భర్త అసంతృప్తిగా ఉండేవాడు. ఈ క్రమంలో కొన్ని నెలల క్రితం ఆమె గర్భవతి అయింది. ఈ సారి ఆమెకు ఓ భయం పట్టుకుంది. నాలుగో సారి ఆడపిల్లకు జన్మనిస్తే తన భర్త తనను ఇంటి నుంచి తరమివేస్తాడని భయపడింది.
ఈ క్రమంలో ఓ బాబాను ఆశ్రయించింది. తాను మగ సంతానం కావాలని కోరుకుంటున్నానని, తనకు సమస్య పరిష్కార మార్గం చూపించాలని ఆ బాబాను వేడుకుంది. దీంతో ఆ దొంగ బాబా ఆమెకు ఓ తాయత్తు, ఓ మేకు ఇచ్చి ఓ మంత్రం చెప్పాడు.
ఆ మంత్రం చదివని తర్వాత మేకు తలలో దిగేలా కొట్టుకోవాలని, అలా చేస్తే కోరిక నెర వేరుతుందని ఆమెకు చెప్పాడు. అతని మాటలు నమ్మిన సదరు మహిళ ఇంటికి వచ్చిన తర్వాత తలకు మేకును సుత్తితో గట్టిగా కొట్టుకుంది. తలలోకి మేకు బలంగా దూసుకుపోవడంతో బాధను బరించలేక కేకలు పెట్టింది. అది గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.