కాంగ్రెస్ పై బీజేపీ మరోసారి తీవ్ర విమర్శలు చేసింది. మధ్యప్రదేశ్‌లో జరుగుతున్న భారత్ జోడో యాత్రలో పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేశారంటూ బీజేపీ ఐటీ సెల్ అధ్యక్షుడు అమిత్ మాలవీయా ఆరోపించారు. ఈ మేరకు ఓ వీడియోను ఆయన ట్వీట్ చేశారు.
ఆ వీడియోను కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి తీసుకున్నట్టు బీజేపీ చెబుతోంది. వీడియోలో మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్‌తో కలిసి రాహుల్ గాంధీ పాదయాత్రగా ముందుకు వెళుతున్నారు. ఆయనతో పాటు పక్కనే ప్రియాంక గాంధీ కూడా ఉన్నారు.
వారి పాదయాత్రగా వెళుతుండగా బ్యాక్ గ్రాండ్ లో కొందరు ‘పాకిస్తాన్ జిందాబాద్’అంటూ నినాదాలు చేయడం వినిపిస్తోంది. ఆ సమయంలో యాత్ర మధ్యప్రదేశ్ లోని కర్గోన్ జిల్లాలోని భన్ భారద్‌లో వుంది. దీన్ని బీజేపీ నేత అమిత్ మాలవీయా పోస్టు చేశారు.
భారత్ జోడో యాత్రలో పాల్గొంటానని నటి రిచా చద్దా ప్రకటించిన తర్వాతే పాకిస్తాన్ అనుకూల నినాదాలు వినిపించాయని మాలవీయా అన్నారు. ఈ వీడియోను కాంగ్రెస్ నేత పోస్టు చేసి డిలీట్ చేశారని ఆయన పేర్కొన్నారు. ఇది కాంగ్రెస్ అసలు స్వభావం అంటూ ఆయన ట్వీట్ చేశారు.
దీనిపై కాంగ్రెస్ మండిపడింది. బీజేపీ చిల్లర రాజకీయాలు చేస్తోందంటూ కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ అన్నారు. భారత్ జోడో యాత్రకు దేశ వ్యాప్తంగా వస్తున్న ఆదరణను చూడలేకే బీజేపీ నేతలు ఇలాంటి పనులకు దిగుతున్నారని ఆయన మండిపడ్డారు. దీనిపై లీగల్ గా ముందుకు వెళతామన్నారు.