పాకిస్తాన్ ఆర్మీకి చెందిన ఏవియేషన్ హెలికాప్టర్ ఒకటి కుప్పకూలింది. ఈ ఘటనలో పాక్ సైన్యానికి చెందిన ఆరుగురు సీనియర్ అధికారులు మరణించినట్టు తెలుస్తోంది.
ఈ విషయాన్ని ఇప్పటి వరకు పాక్ అధికారులు ధ్రువీకరించలేదు. బలూచిస్తాన్ లోని లాస్ బెలాలో వరద సహాయక చర్యల్లో పాల్గొన్న సమయంలో హెలికాప్టర్ అదృశ్యమైనట్టు సమాచారం.
హెలికాప్టర్ అదృశ్యమైన విషయాన్ని నిర్దారించిన అధికారులు హెలికాప్టర్ కుప్ప కూలిన విషయాన్ని మాత్రం ధ్రువీకరించలేదు. హెలికాప్టర్ అదృశ్యమైన సమయంలో అందులో కార్ప్స్ కమాండర్ 12 (క్వెట్టా) సహా ఆరుగురు ఉన్నట్టు అధికారి ఒకరు తెలిపారు.
బలూచిస్థాన్‌లోని విందర్, సాస్సీ పున్ను మందిరం మధ్య ప్రాంతంలో హెలికాప్టర్ కుప్పకూలి ఉంటుందని అధికారులు అంచనావేస్తున్నారు. ఘటనా ప్రదేశానికి వెళ్లి పరిస్థితిని అధికారులు పరిశీలిస్తున్నారు.
లాస్ బెలాలో ఏవియేషన్ హెలికాప్టర్ కు ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయని పాకిస్థాన్ ఆర్మీ ట్వీట్ చేసింది. ఓ కమాండర్ సహా ఆరుగురు వ్యక్తులు అందులో ఉన్నట్టు పాక్ ఆర్మీ పేర్కొంది. గాలింపు చర్యలు కొనసాగుతున్నట్టు చెప్పింది.