క్రికెట్ మ్యాచ్ లో క్యాచ్ లు చాలా ముఖ్యమైనవి. క్యాచ్ లు మ్యాచ్ గతినే మార్చివేసిన సందర్బాలు చాలానే ఉన్నాయి. అందుకే క్యాచ్ లను ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టవద్దని తమ ఫీల్డర్లకు కోచ్ లు, టీమ్ కెప్టెన్లు చెబుతుంటారు.
ఇంత చెప్పిన తర్వాత కూడా చాలా సార్లు క్యాచ్ మిస్ అవుతుంటాయి. అలా జరిగినప్పుడు కొందరు కెప్టెన్లు కూల్ గా ఉంటారు. మరోసారి అలా జరగకుండా చూసుకోడని సూచనలు చేస్తారు. మరి కొద్ది మంది మాత్రం కోపంతో దూషణలకు దిగుతుంటారు.
ఇవి మనం ఎప్పుడూ చూస్తు వస్తున్నవే. కానీ దీనికి భిన్నంగా పాకిస్తాన్ సూపర్ లీగ్ లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. క్యాచ్ మిస్ చేశాడంటూ సహచర ప్లేయర్ ను బౌలర్ చెంపచెల్లు మనిపించాడు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సామాజిక మాద్యమాల్లో చెక్కర్లు కొడుతున్నాయి. వివరాల్లోకి వెళితే…
సూపర్ లీగ్ లో భాగంగా పెషావర్ జాల్మి, లాహోర్ ఖలండర్స్ జట్ల మధ్య సోమవారం మ్యాచ్ జరిగింది. ఇందులో ఖలండర్స్ తరఫున హరీశ్క రావూఫ్ బౌలింగ్ చేశాడు. అతని బౌలింగ్ లో జాల్మి బ్యాటర్ హజ్రతుల్లా జజాయ్ బంతిని గాల్లోకి లేపాడు. దీంతో బంతిని క్యాచ్ అందుకోవడానికి కమ్రాన్ గులామ్ వచ్చాడు. కానీ అనుకోకుండా అతను ఆ క్యాచ్ మిస్ చేశాడు.
దీంతో గులామ్ పై రావూఫ్ ఆగ్రహంతో ఊగిపోయాడు. అయితే అదే ఓవర్ లో మరో బ్యాట్స్ మన్ మొహమ్మద్ హారిస్ క్యాచ్ ఇవ్వగా ఈ సారి ఫావద్ ఆలమ్ అందుకున్నాడు. బ్యాట్స్ మన్ అవుటవడంతో అందరూ సంబురాలకు దిగారు. దీంతో గులామ్ కూడా హారీస్ దగ్గరకు వచ్చి అభినందనలు తెలిపాడు.
కానీ అంతకు ముందు కమ్రాన్ క్యాచ్ మిస్ చేసిన విషయం హరీస్ కు గుర్తుకు వచ్చింది. దీంతో కమ్రాన్ చెంపను హరీస్ చెల్లుమనిపించాడు. దీనికి సంబంధించిన వీడియోను పీఎస్ఎల్ లీగ్ నిర్వాహకులు తమ ట్విట్టర్ అధికారిక ఖాతాలో ఉంచారు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతోంది.