చూసేవాడుంటేనే కదా ఆడేవాడికి ఆనందం ! అలాంటి ఆనందానికి కారణమైన వాడేకదా అభిమాని. ఆటగాళ్ళు అనుకున్నంతగా ఆడకపోతే అభిమానులు ఓ ఆట ఆడుకోవడం క్రీడారంగంలో మామూలు విషయం !. క్రికెట్లో అయితే సర్వసాధారణం. ఫామ్ లో ఉన్నప్పుడు బాగా ఆడతారు, లేనప్పుడు పేలవంగా ఆడతారు. తమకంటూ ఓ రోజు వస్తుందని ముందుకెళ్ళడమే ఆటగాడి లక్షణం. సంయమనం కోల్పోతే మరింత చేదుఅనుభవాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
పాకిస్థానీ పాస్ట్ బౌలర్ హసన్ అలీకి అలాంటి అనుభవమే ఎదురైంది. సంయమనం కోల్పోయిన హసన్ కామెంట్ చేసిన అభిమానులను కొట్టడానికి వెళ్ళాడు. ఓ ఆటగాడినన్న సంగతి మరచిపోయి కొంతమంది ఫ్యాన్స్ తో గ్రౌండ్ లోనే గొడవకు దిగాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇటీవలే అతడు ఒక లోకల్ మ్యాచ్ లో పాల్గొన్నాడు. పంజాబ్ ఫ్రావిన్స్ లో పక్ పత్తన్ జిల్లాలో ఈ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో హసన్ అలీ బౌండరీ లైన్ దగ్గరున్నాడు. కొంత మంది ఆకతాయి అభిమానులు అలీని కామెంట్ చేసారు. జట్టులో చోటు కోల్పోయి గల్లీ క్రికెట్ ఆడటానికి వచ్చాడంటూ కామెంట్ చేసారు. కొంత మందైతే గడ్డి,పేపర్లను కూడా విసరడంతో హసన్ అసహనానికి లోనయ్యాడు.వారితో వాగ్వాదానికి దిగాడు. కొట్టడానికి ప్రయత్నించాడు. అయితే పరిస్థితిని అర్ధం చేసుకున్న మరికొంతమంది అభిమానులు అలీని అదుపుచేసారు.
You gotta feel for Hasan Ali. He is out of the team but never gave any toxic statement always kept supporting the team. Once a No 1 ODI bowler and now he is facing such things in a random club game. pic.twitter.com/L2OLjVPRQd
— zayn (@ZaynMahmood5) December 4, 2022
ఒకలోకల్ మ్యాచ్ లో ఆడేందుకు ఒప్పుకున్న అంతర్జాతీయ క్రికెటర్ని ఇలా అవమానిస్తారా అంటూ సంబంధించిన వారిపై మ్యాచ్ నిర్వాహకులు ఆగ్రహం వ్యక్తం చేసారు. అలీతో గొడవకు దిగిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కాగా 2021 టి20 ప్రపంచకప్ లో ఆస్ట్రేలియాతో జరిగిన కీలక సెమీఫైనల్లో హసన్ అతి సులువైన క్యాచ్ ని నేలపాలు చేయడంతో అలీ తరచూ ట్రోల్స్ కి గురయ్యాడు. కొంతకాలానికి ఫ్యామ్ కోల్పోయి అతను జట్టుకే దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో అలీని అవమానించడం పట్ల నెట్టింట మిశ్రమ స్పందన లభిస్తోంది.