పాకిస్తాన్ లో ఇండియా పట్ల కసి, ద్వేషం పెరుగుతున్నాయి. తమ దేశంలో భారత దేశానికి సంబంధించిన కార్యక్రమాలను టీవీ ఛానళ్లలో ప్రసారం చేసే కేబుల్ ఆపరేటర్లపై అక్కడి ఎలెక్ట్రానిక్ మీడియా వాచ్ డాగ్.. కొరడా ఝళిపించింది. ఇండియన్ ఛానళ్లు అక్రమ ఛానెళ్ళని, ఇండియన్ ‘కంటెంట్’ కూడా అలాంటిదేనని పాకిస్తాన్ ఎలెక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరీ అథారిటీ ఆరోపించింది. అందువల్లే తమ ఫీల్డ్ సిబ్బంది … నలుగురు కేబుల్ ఆపరేటర్లపై దాడులు చేసినట్టు ప్రకటించింది.
కరాచీ లోని షార్జా కేబుల్ నెట్ వర్క్, కరాచీ కేబుల్ సర్వీసెస్, న్యూ శాటిలైట్ కమ్యూనికేషన్, స్టార్ డిజిటల్ కేబుల్ నెట్ వర్క్ లకు చెందిన కేబుల్ ఆపరేటర్లు ‘అక్రమ ఇండియన్ కంటెంట్’ ని ప్రసారం చేస్తున్నారని, అందువల్లే ఈ దాడులు నిర్వహించామని పేర్కొంది. ఈ సందర్భంగా ఈ కార్యాలయాలలోని ‘అక్రమ’ పరికరాలు, సాధనాలను సీజ్ చేసి.. వీరికి షో కాజ్ నోటీసులు జారీ చేసినట్టు ఓ స్టేట్మెంట్ లో వెల్లడించింది.
సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను వీరు కావాలనే ఉల్లంఘిస్తున్నారని కూడా విమర్శించింది. దేశంలోని కేబుల్ ఆపరేటర్లంతా తక్షణమే భారతీయ ఛానళ్లను, కంటెంట్ ను నిలిపివేయాలని ఆదేశించింది. ఈ ఆదేశాలను ఏ కేబుల్ ఆపరేటర్ అతిక్రమించినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
స్థానిక టీవీల్లో భారతీయ కార్యక్రమాలు లేదా షోల ప్రసారాలను 2016 లో ఈ సంస్థ పూర్తిగా నిషేధించింది. అయితే ఏడాది తరువాత లాహోర్ హైకోర్టు ఈ నిషేధాన్ని ఎత్తివేసింది. కానీ 2018 లో హైకోర్టు ఉత్తర్వులను పక్కన బెట్టిన సుప్రీంకోర్టు.. మళ్ళీప్రసారాలపై బ్యాన్ విధించింది.