పాకిస్తానీ అమ్మాయి ఇక్రా జీవానీ, ఇండియా అబ్బాయి ములాయం సింగ్ యాదవ్ ఇద్దరూ ప్రేమించుకున్నారు. వీరిద్దరినీ ఆన్ లైన్ ల్యుడో గేమ్ కలిపింది. వీరి ప్రేమకు దేశాలు, ఎల్లలు హద్దులు కాలేదు. ఎక్కడో పాక్ లోని సింధ్ ప్రావిన్స్ లోని హైదరాబాద్ లో నివసించే ఇక్రా.. యూపీకి చెందిన ములాయం సింగ్ తో ప్రేమలో పడింది. ఆమె ఇండియాకు చేరుకోవడానికి ములాయం నేపాల్ వెళ్లి ఆమెను ఈ దేశానికి తీసుకువచ్చాడు. ఇద్దరూ గత జనవరి 23 న పెళ్లి చేసుకుని బెంగుళూరులో మకాం పెట్టారు.
ఇదే సిటీలో సెక్యూరిటీ గార్డుగా ములాయం సింగ్ పని చేస్తూ వచ్చాడు. అయితే 19 ఏళ్ళ ఇక్రా జీవానీ అక్రమంగా ఇండియాకు వచ్చేందుకు తన ఐడెంటిటీని ఫోర్జరీ చేసిందని ఫారినర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీసు వర్గాలకు తెలిసిపోయింది. పైగా తన భార్య పేరును రావా యాదవ్ గా తప్పుడుగా పేర్కొని ములాయం సింగ్ ఆధార్ కార్డు కూడా సేకరించాడు.
ఇండియన్ పాస్ పోర్టు కోసం చేసిన దరఖాస్తులో కూడా ఇదే పేరు చేర్చాడు. మొత్తానికి వీరి మోసం ఇంటెలిజెన్స్ వర్గాలకు తెలిసిపోయింది. పోలీసులు ఇద్దరినీ అరెస్టు చేశారు.
ఇక్రా జీవానీని తిరిగి పాకిస్థాన్ కు పంపేశారు. తనను తన స్వదేశానికి పంపవద్దన్న ఆమె విజ్ఞప్తిని అధికారులు తిరస్కరించారు..బెంగుళూరులోనే తన భర్తతో కలిసి తాను జీవించాలనుకుంటున్నట్టు ఆమె చెప్పినా వారు వినలేదు. వీరిద్దరికీ క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ లేదని పోలీసులు తెలిపారు. ముఖ్యంగా ఇక్రా విషయంలో భారత అధికారులకు, పాక్ ప్రభుత్వానికి మధ్య సుమారు 2 నెలల పాటు సుదీర్ఘంగా చర్చలు నడిచాయి.