పాకిస్తాన్ పార్లమెంట్ శుక్రవారం వాయిదా పడింది. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై అవిశ్వాసం తీర్మానం పెట్టకుండానే పార్లమెంట్ ను శుక్రవారం వాయిదా వేశారు.
ఇటీవల మృతి చెందిన పలువురు నేతలకు పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ శుక్రవారం నివాళులు అర్పించింది. ఆ తర్వాత వెంటనే మార్చి 28కి పార్లమెంట్ ను స్పీకర్ అసద్ ఖైసర్ వాయిదా వేశారు.
అవిశ్వాసం తీర్మానం ప్రవేశ పెట్టనుండటంతో నేషనల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత షెహబాజ్ షరీఫ్, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ ఛైర్మన్ బిలావల్ భుట్టో-జర్దారీ, కో-చైర్ అసిఫ్ అలీ జర్దారీతో సహా పలువురు ప్రముఖ ప్రతిపక్ష సభ్యులు శుక్రవారం పార్లమెంటుకు హాజరయ్యారు.
పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానం పై చర్చ చేపట్టకుండా వాయిదా వేయడంపై ప్రతి పక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. అవిశ్వాస తీర్మానంపై చర్చ జరపాల్సిందేనని ప్రతిపక్ష సభ్యులు పట్టుపట్టారు. దీనిపై ఖైజర్ స్పందిస్తూ.. సభ నడిచినప్పుడు రాజ్యాంగం ప్రకారం అవిశ్వాస తీర్మానంపై చర్చకు అనుమతిస్తానని తెలిపారు.
దీంతో ప్రధాని ఇమ్రాన్ కు తాత్కాలిక ఉపశమనం లభించింది. ఇక ఇమ్రాన్ ఖాన్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు మార్చి 8న నోటీసులను ప్రతిపక్షాలు ఇచ్చాయి.
ఈ పత్రాలపై సుమారు 152 మంది ప్రతిపక్ష పార్టీ ఎంపీలు సంతకాలు చేశారు. సమావేశాలను సోమవారానికి వాయిదా వేయడంతో అదే రోజు అవిశ్వాస తీర్మానంపై చర్చకు పట్టుబట్టాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి.