2021-22 సంవత్సరానికి సంబంధించి తమ దేశ ఆర్థిక సర్వేను పాకిస్తాన్ ప్రభుత్వం ఇటీవల విడుదలచేసింది. ఇందులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా రాజకీయ సంక్షోభ సమయంలోనూ ఆ దేశ జీడీపీ పెరిగినట్టు తెలుస్తోంది. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం నిర్దేశించిన 5.97 జీడీపీ వృద్ధి లక్ష్యాన్ని అత్యంత వేగంగా పాక్ అందుకుంది.

పాక్ లో పెరిగిన గాడిదల జనాభా
పాకిస్తాన్ లో గాడిదల జనాభా ఇటీవల గణనీయంగా పెరుగుతోంది. 2019-2020లో దేశంలో 5.5 మిలియన్ల గాడిదలు ఉండగా, 2020-2021లో అది 5.6 మిలియన్లు, 2021-22లో అది 5.7 మిలియన్లకు చేరుకుంది. ప్రస్తుతం గాడిదల జనాభాలో పాక్ మూడవ స్థానంలో ఉంది.
గాడిదల నుంచి ఆదాయం..
పాక్ జీడీపీలో 14శాతం ఆదాయం వ్యవసాయ రంగం నుంచి వస్తుంది. ఈ ఏడాది వ్యవసాయ రంగంలో 4.4 శాతం వృద్ధి చోటుచేసుకుంది. ఆశ్చర్యకరంగా అందులో పంటల పెరుగుదల వల్ల 6.6 శాతం, పశువుల పెంపకం వల్ల 3.3 శాతం వృద్ధి చోటు చేసుకుంది. ఈ 3.3 శాతంలో అధికంగా వృద్ధి గాడిదల పెంపకం నుంచే చోటు చేసుకోవడం గమనార్హం.
చైనాకు గాడిదలను ఎగుమతి చేస్తున్న పాక్
చైనాకు పాక్ పెద్ద మొత్తంలో గాడిదలను ఎగుమతి చేస్తూ ఆదాయాన్ని పొందుతోంది. గాడిద నుంచి లభించే హైడ్, గిలాటిన్ లను ఔషదాల తయారీలో ఉపయోగిస్తారు. వీటికి చైనాలో బాగా డిమాండ్ ఉంది. దీంతో పాక్ లో గాడిదల ఫార్మింగ్ పై భారీగా పెట్టుబడులు పెట్టాలని చైనా చూస్తోంది. దీంతో పాక్ లో పశువుల పరిశ్రమ వేగంగా వృద్ధి చెందుతోంది.