పాక్ నూతన ప్రధాని షెహబాబ్ షరీఫ్ తొలి ప్రసంగంలోనే భారత్ తో సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ తో తాము సత్సంబంధాలను కోరుకుంటున్నామని చెబుతూనే కశ్మీర్ సమస్య పరిష్కారం అయితేనే అది సాధ్యం అంటూ మెలికపెడుతున్నారు.
కశ్మీర్ ప్రజలకు తమ దౌత్యపరమైన, నైతిక మద్దతు కొనసాగుతుందని పేర్కొన్నారు. కశ్మీర్ సోదరులు, సోదరీమణుల కోసం ప్రతి వేదికపైనా తమ గొంతును వినిపిస్తామని ఆయన తెలిపారు. సరిహద్దుకు ఇరువైపులా పేదరికం, నిరుద్యోగం, వ్యాధులు ఉన్నాయని, ఈ విషయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ గ్రహించాలన్నారు.
‘ మన భావి తరాలు బాధ పడాలని మనం ఎందుకు కోరుకుందాం. రండి యూఎస్ నిర్ణయాలకు అనుగుణంగా, కశ్మీరి ప్రజల అంచనాలకు అనుగుణంగా కశ్మీర్ సమస్యను పరిష్కరించుకుందాం’ అని అన్నారు.
పాక్ నూతన ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన షెహబాజ్ షరీఫ్ కు ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ఉగ్రవాదం లేని ప్రాంతంలో శాంతి, సుస్థిరతను భారత్ కోరుకుంటోందన్నారు. తద్వారా మన అభివృద్ధి సవాళ్లపై దృష్టి పెట్టవచ్చని, మన ప్రజల శ్రేయస్సును అందించవచ్చని అన్నారు.