రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం ప్రపంచ దేశాలలో ఆందోళనలు కలిగిస్తోంది. ఇప్పటికే పలు దేశాలు ఉక్రెయిన్ కు మద్దతు ప్రకటించాయి. రెండు దేశాల మధ్య యుద్ద వాతావరణం నెలకొన్న వేళ.. పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ రష్యాలో పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయనకు రష్యాలో స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్ధరించడం, ఇంధన రంగంలో సహకారాన్ని విస్తరించే అంశాలపై ఇమ్రాన్ చర్చలు జరుపనున్నారు. వీటితోపాటు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలు సహా అఫ్గానిస్థాన్ పరిస్థితులపైనా విస్తృతంగా చర్చిస్తారని పాక్ విదేశాంగశాఖ కార్యాలయం వెల్లడించింది.
అయితే.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో పాటు ఇతర దేశాలు రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధిస్తున్న సమయంలో పాక్ ప్రధాని రష్యా పర్యటనలో ప్రాధాన్యత సంతరించుకుంది. అఫ్గాన్ నుంచి అమెరికా బలగాలను ఉపసంహరించుకున్న తర్వాత మిలటరీ బేస్ లను అమెరికాకు ఇచ్చేందుకు పాకిస్థాన్ నిరాకరించింది.
అంతేకాకుండా.. జో బైడెన్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఫోన్ లోనూ మాట్లాడేందుకు పాక్ ప్రధాని అందుబాటులోకి రాలేదు. దీంతో తన మద్దతు రష్యాకే ఉంటుందని అమెరికాకు సంకేతాలు పంపించేందుకు ఈ పర్యటనను పాక్ ప్రధాని ఉపయోగించుకోనున్నట్లు విశ్లేషకులు చెప్తున్నారు.
రష్యా పర్యటనలో పాకిస్థాన్ ప్రధానితో పాటు.. విదేశాంగశాఖ మంత్రి షా మహమ్మూద్ ఖురేషీ, ఐటీశాఖ మంత్రి ఫవాద్ ఛౌద్రీ, ప్రణాళిక శాఖ మంత్రి అసద్ ఉమర్, ఆర్థిక సలహాదారు అబ్దుల్ రజాక్ దావూద్, జాతీయ భద్రతా సలహాదారు డాక్టర్ మోయిద్ యూసఫ్ ల బృందం ఉన్నట్లు పాక్ విదేశాంగశాఖ కార్యాలయం తెలిపింది.