కర్ణాటక రిజల్ట్స్ ను చూసి హస్తం పార్టీ నేతలు పగటి కలలు కంటున్నారని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆ పార్టీకి పాలమూరు జిల్లాలో మొహం లేదని ఆయన మండి పడ్డారు. కాంగ్రెస్ పాలన పాపమే పాలమూరు వలసలు, ఆకలి చావులు, ఆత్మహత్యలని ఆయన ధ్వజమెత్తారు.
పాలమూరుకు తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందో కళ్లముందు కనిపిస్తుందన్నారు. జడ్చర్ల బహిరంగ సభలో కాంగ్రెస్ నేతల విమర్శలపై ఆయన స్పందించారు. ఐదు దశాబ్దాల పాలనతో పాలమూరు అధోగతి పట్టిందన్నారు. ఇక పెండింగుకు పర్యాయపదం కాంగ్రెస్ అని.. ఆ పార్టీ పాలనలో నీళ్లు పెండింగ్, నిధులు పెండింగ్, కరెంటు పెండింగ్, పింఛన్ పెండింగ్, పాలన పెండింగ్, చివరికి ప్రజల సమస్యలు కూడా పెండింగ్ అంటూ ఆయన మండిపడ్డారు.
బీఆర్ఎస్ తొమ్మిదేళ్ళ పాలనలో పాలమూరు వ్యవసాయరంగ స్వరూపం మారిపోయిందని ఆయన అన్నారు. కాంగ్రెస్ పాలనలో అంబలి కేంద్రాలు, గంజి కేంద్రాలు ఉండేవని..కాని ఇప్పుడు మాత్రం ప్రతి ఊరులో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉన్నాయని అన్నారు. మండుటెండల్లో కూడా చెరువుల్లో ఉన్న నీరే కాంగ్రెస్ నేతల ప్రశ్నలకు సమాధామని ఆయన ఫైర్ అయ్యారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని స్పష్టం చేశారు.
అధికారం మీద కాంగ్రెస్ దింపుడు కళ్లెం ఆశతో ఉందని ఆయన విమర్శించారు. ఇక హస్తం పార్టీలో అందరూ కట్టప్పలేనని ఎద్దేవా చేశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల మీద కేసులు వేసి అడ్డుకున్న కాంగ్రెస్ నేతలు ప్రాజెక్టు ఎందుకు ఆలస్యం అయ్యిందనడం ఆశ్చర్యంగా ఉందన్నారు. నాలుగున్నరేళ్ల కేసీఆర్ పాలన చూసి 2018 లో ఉమ్మడి పాలమూరులో 14 కు 13 స్థానాల్లో ప్రజలు బీఆర్ఎస్ కు పట్టం కట్టారన్నారు. ప్రజాస్వామ్యంతో ఎన్నికలే పాలకుల సామర్థ్యానికి గీటు రాయి అని..ఐదు దశాబ్దాల పాలనలో కాంగ్రెస్ పార్టీ పాలమూరు జిల్లాకు చేసిన అన్యాయానికి ఆ పార్టీ నేతలు జీవిత కాలం ఊడిగం చేసినా వారి పాపానికి ప్రాయశ్చిత్తం ఉండదన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి.