ఏఐడీఎంకే జనరల్ సెక్రటరీ పదవికి ఆ పార్టీ తాత్కాలిక చీఫ్ కే. పళనీ స్వామి నామినేషన్ వేశారు. నామినేషన్ కార్యక్రమానికి ఆయన మద్దతుదారులు, అభిమానలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో వచ్చారు. కార్యాలయంలో ఎన్నికల అధికారులకు ఆయన తన నామినేషన్ పత్రాలు సమర్పించారు.
పార్టీ జనరల్ సెక్రటరీ పదవికి ఈ నెల 26న ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఏఐడీఎంకే పార్టీ ఇటీవల వెల్లడించింది. ఈ మేరకు పార్టీ ఎన్నికల అధికారులు ఆర్ విశ్వనాథన్, పొల్లాచీ జయరామన్ ఓ ప్రకటనను కూడా విడుదల చేశారు. ఈ నెల 18న నామినేషన్ల ప్రక్రియన మొదలవుతుందని ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ నెల 19తో నామినేషన్ల ప్రక్రియ ముగుస్తుందని వెల్లడించారు. 20న నామినేషన్ల పరిశీలన జరుగుతుందన్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 21 వరకు గడువు వున్నట్టు చెప్పారు. ఈ నెల 26 జనరల్ సెక్రటరీ పదవికి ఎన్నికలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు.
ఈ నెల 27న ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపట్టి విజేతను ప్రకటించనున్నారు. పార్టీ చట్టంలోని 20(ఏ)లోని సెక్షన్ 2 ప్రకారం కార్యకర్తలు ఓట్లు వేసి జనరల్ సెక్రటరీని ఎన్నుకోనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు రూ. 25,000 ఫీజ్ చెల్లించి పార్టీ హెడ్ క్వార్టర్ లో నామినేషన్లు వేయవచ్చని పేర్కొన్నారు.